Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భూభాగమేనంటూ మ్యాప్ విడుదల!

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భూభాగమేనంటూ మ్యాప్ విడుదల!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా అభివర్ణిస్తూ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంలో భాగంగా చూపించే మ్యాప్‌ను మరోసారి పోస్టు చేశారు. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలోనూ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగానే పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నౌకా రవాణాపై అమెరికా చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ ఇంధన సరఫరాలో హర్మూజ్ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ప్రపంచ సముద్ర చమురు రవాణాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో ఏర్పడే ఎలాంటి అంతరాయమైనా అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే ట్రంప్ వాదనలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. హర్మూజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం ఉందన్న వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు ఖండించారు. అమెరికా తన హామీలను నెరవేర్చడంతో పాటు వైఖరిని మార్చుకునే వరకు జలసంధిని మూసివేసే అంశంలో తమ నిర్ణయం కొనసాగుతుందని ఇరాన్ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ త్వరలో కొత్త ఆంక్షల వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపేలా ఈ ఆంక్షలు ఉండవచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ నౌకా రవాణాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. కొన్ని నౌకలు భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయాణిస్తుండగా, మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం హర్మూజ్ వంటి అంతర్జాతీయ సముద్ర రవాణాకు కీలకమైన జలసంధిపై ఏ ఒక్క దేశానికీ సంపూర్ణ ఆధిపత్యం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

also read: ప్రాంక్ మెసేజ్‌తో బయటపడిన బెట్టింగ్ బాగోతం.. ఫ్లాట్‌లో రూ.30 లక్షలు బట్టబయలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు