ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగించాలని ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నిర్ణయించింది. బుధవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు సమాఖ్య వెల్లడించింది.
ఫెడరేషన్‌కు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జానీ మాస్టర్‌పై గతంలో తీసుకున్న చర్యలను కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆయనకు సంబంధించిన నిషేధం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమావేశంలో డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై కూడా ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. సినీ రంగానికి చెందిన పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను పట్టించుకోకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని సమాఖ్య తప్పుబట్టింది.
ఈ పరిణామాల నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై ఫెడరేషన్ తరఫున ఎలాంటి సంస్థాగత సహకారం అందించకూడదని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే సాధారణ డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు మిగిలిన 23 క్రాఫ్టులకు ఫెడరేషన్ నుంచి గతంలో అందుతున్న సహకారం యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. అలాగే జానీ మాస్టర్ గతంలో ఫెడరేషన్‌కు అందజేసిన రూ.3 లక్షల మొత్తాన్ని కూడా తిరిగి ఆయనకే పంపించాలని నిర్ణయించినట్లు సమాఖ్య పేర్కొంది.
ఈ నిర్ణయాలతో తెలుగు సినీ కార్మిక రంగంలో ఫెడరేషన్, డ్యాన్సర్స్ యూనియన్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్టయ్యింది.
also read: విజయ్–రష్మిక సరదా కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్!
