-తెలంగాణ పాలన యంత్రాంగంలో భారీ స్కాం
-ఉద్యోగుల వివరాలు తెలుసుకునే క్రమంలో వెలుగులోకి..
-రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
-కఠిన చర్యలకు ఉపక్రమణ..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-తెలంగాణ బాలనాయంత్రాంగంలో భారీ వైఫల్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. అది మామూలు అక్రమం కాదు. విస్తు పోయే అక్రమ పర్వమే. ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వేరు పేర్లతో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా.. నెలకు లక్షల్లో రెండు జీతాలు దర్జాగా వెలగబెడుతున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ చేపట్టిన సాంకేతిక తనిఖీల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను మరింత పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఎమ్ఐఎస్ పోర్టల్ లో ఉద్యోగుల ఆధార్, సర్వీసు వివరాల ధ్రువీకరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాగా.. భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏకంగా 40 మంది..
రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ తనిఖీ ప్రక్రియను ప్రారంభించారు. కానీ 40 ఆధార్ నెంబర్లకు ఏకంగా 80 మంది ఉద్యోగుల వివరాలు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించారు. అంటే ఒక్క ఆధార్ నెంబర్ పై ఇద్దరు ఉద్యోగులు వేరువేరు పేర్లతో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల జీతాలు పొందుతున్నారన్నమాట. అయితే ఒకే ఆధార్ పై రెండేసి జీతాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది రెగ్యులర్ ఉద్యోగులే ఉన్నారు. ఒక్కో ఉద్యోగి హోదాను బట్టి నెలకు లక్ష నుంచి ఏకంగా నాలుగు లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని చట్ట విరుద్ధంగా డ్రా చేస్తున్నట్లు వెలుగు చూసింది. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయితీ రాజ్, ప్రజారోగ్య శాఖలో ఇలాంటి డూప్లికేట్ కేసులు ఎక్కువగా నమోదయినట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కఠిన దండన
ప్రభుత్వం ఉద్యోగుల వివరాలను పారదర్శకంగా పోర్టల్ లో పొందుపరచాలని లక్ష్యంతో ఈ క్రాస్ చెక్ చేపడుతుండగా.. భారీ అక్రమాలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని.. అక్రమాలకు పాల్పడిన వారిని నిర్ధాక్షణ్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థలు లేదా శాఖల నుంచి అక్రమంగా జీతాలు పొందినట్లు రుజువైతే సదరు ఉద్యోగులపై తక్షణమే శాఖా పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. వారి నుంచి ఆ జీతాలను రికవరీ చేయాలని కూడా స్పష్టం చేసింది. తీవ్ర నేరంగా పరిగణించి జైలుకు కూడా పంపాలని ఆదేశించింది. అయితే ఈ అవకతవకలకు పాల్పడిన వారిపైనే కాకుండా సహకరించిన అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ స్కాంతో సంబంధం ఉన్న ఉద్యోగులు,, సహకరించిన అధికారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
