క్రైమ్ మిర్రర్, జాతీయం:- పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లా బిదాన్ నగర్ లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అన్నపూర్ణ బండార్ పథకం కింద బ్యాంకు ఖాతాలో జమ అయిన 2000 రూపాయల నగదును విత్డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఒక నిరుపేద మహిళ షాక్ అయ్యే ఘటన చోటుచేసుకుంది. అకౌంట్లో జమ అయిన 2000 రూపాయలను విత్డ్రా చేయగా.. అకౌంట్లో ఇంకా రూ.740 కోట్ల 68 లక్షలు మిగిలిన బ్యాలెన్స్ గా చూపించడంతో సదరు మహిళ నిర్గ్రాంత పోయింది. తన జీవితంలో ఇప్పటి వరకు వినని మొత్తాన్ని తన బ్యాంకు అకౌంట్లో ఉన్నట్లు చూపించడంతో ఆమె షాక్ కు గురైంది. డార్జిలింగ్ జిల్లాలోని ఫాన్సీ దేవ బ్లాక్ లో ఉన్న కోచు భారీ గ్రామానికి చెందిన మెహ రూణేషా అనే మహిళ శనివారం ఉదయం 11:30 సమయంలో తన ప్రాంతంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్కు వెళ్లింది. అన్నపూర్ణ బండారు పథకం కింద తనకు వచ్చిన సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నించింది. బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా 2000 రూపాయలు బ్యాంకు అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకుంది. అక్కడ వరకు బాగానే ఉంది. ఆమె కూడా తనకు కావాల్సిన డబ్బు రావడంతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అనుకోకుండా తన ఖాతా బ్యాలెన్స్ ఎంత ఉందో చూపించమని ఆమె కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రతినిధిని కోరింది. కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రతినిధి కూడా ఆమె కోరినట్టుగానే బ్యాంకు బ్యాలెన్స్ కు సంబంధించిన వివరాలను చెక్ చేశారు. బ్యాంకు వివరాలు చూసిన కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రతినిధి అందులో ఉన్న మొత్తాన్ని చూసి షాక్ అయ్యాడు. మహిళ పొదుపు ఖాతాలో ఏకంగా రూ.740 కోట్ల 60 లక్షల రూపాయల డబ్బు ఉన్నట్టు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ మహిళతోపాటు కస్టమర్ కేర్ పాయింట్ సిబ్బంది, స్థానిక మహిళలు, ప్రజలు షాక్ అయ్యారు. మెహ్రోనేశా కోటేశ్వరరావు అయిపోయిందంటూ అక్కడున్న వారంతా వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఈ విషయం ఈ నోటా ఆ నోటా చుట్టుపక్కల ప్రాంతాలకు చేరడంతో ఆమెను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఇదంతా చూసిన ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. సదరు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రతినిధి కూడా డబ్బులు విత్డ్రా చేసేందుకు అంగీకరించలేదు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సదర మహిళలకు సూచించాడు.
ఉన్నతాధికారులకు సమాచారంతో అకౌంట్ ఫ్రీజ్..
నిరుపేద కూలి కుటుంబానికి చెందిన మహిళ ఖాతాలో ఒక్కసారిగా కోట్లాది రూపాయలు డబ్బు జమ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ మహిళ కూడా దీనిపై ఎలా స్పందించాలో తెలియక మౌనాన్ని దాల్చింది. ఇంత డబ్బు తమకు ఎలా జమ అయిందో తెలియడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించింది. కస్టమర్ సర్వీస్ పాయింట్ యజమాని సాహిద్ అన్వర్ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. 2000 విత్డ్రా చేసిన తరువాత బ్యాలెన్స్ చెక్ చేయగా.. కోట్లాది రూపాయల ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని మహిళకు సూచించినట్లు తెలిపారు. సదరు మహిళ వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులకు విషయాన్ని తెలియజేయడంతో ఈ సమస్య బ్యాంకులో జరిగిన సాంకేతిక లోపం వల్ల తలెత్తినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మహిళ పొదుపు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటు పోలీసులతో పాటు అటు బ్యాంకు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.