కర్ణాటకలో మరోసారి గృహహింస దారుణ రూపం దాల్చింది. హుబ్బಳ್ಳಿ గ్రామీణ పరిధిలోని తరిహాల్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కేవలం చిన్న కుటుంబ వివాదం ప్రాణాంతకంగా మారి, ఓ యువతి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగరత్నం (19) అనే యువతి ఇటీవలే శివరాజ్‌తో వివాహం జరిగింది. అయితే బుధవారం ఉదయం దంపతుల మధ్య స్వల్ప విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో కోపావేశానికి లోనైన భర్త శివరాజ్, ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్ హెల్మెట్‌తో నాగరత్నం తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో నాగరత్నం తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలింది. పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గృహహింస కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. కుటుంబ వివాదాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. సమాజంలో పెరుగుతున్న గృహహింస ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
also read: రూ.2,000 నోటు ఇంకా మీ దగ్గర ఉందా? నోటుపై RBI క్లారిటీ – ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందా?