-
మంత్రుల మధ్య సమన్వయ లోపం
-
సీఎం రేవంత్ ఆలోచనలకు తగ్గట్టు పనిచేయని సీనియర్ అమాత్యులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ తన పని తాను చేసుకుంటే.. మంత్రులు ఎవరు ఏం చేస్తున్నారు తెలియని పరిస్థితి.
ఏ ఒక్క మంత్రి కూడా తమ పరిధిలోని శాఖలను సక్రమంగా పర్యవేక్షించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ నేతలు తమకు తోచింది తాము చేసుకుంటూ పోతుండడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
-
లెక్కలేని తనం
తెలంగాణ క్యాబినెట్ లో ఉన్న చాలామంది సీనియర్లు సీఎం రేవంత్ అంటే లెక్కలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన కంటే పాము సీనియర్లను అన్నది వారి భావన. గతంలోనే మంత్రులుగా పని చేసిన వారు.. తమకు ఎవరి మార్గదర్శకాలు అవసరం లేదన్నట్టు భావనతో ఉన్నారు. సీఎం రేవంత్ సైతం పదేపదే చెప్పేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎవరిపై పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకు పోతున్నారు.
దీంతో సీఎం అంటే లెక్కలేని తనం మంత్రుల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు స్పష్టమైన గ్యాప్ వుంటోంది. ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రివర్గ సహచరుల మధ్య అస్సలు సమన్వయం లేదు. ఒకరి శాఖ పరిధి అంశాల్లో మరొకరు వేలు పెడుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక గ్రూపులు ప్రోత్సహిస్తుండడంతో మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి.
-
సురేఖ రూపంలో వివాదం..
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండా.. ఆమెను పూర్తిగా విస్మరించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖపై అధికారిక సమీక్ష నిర్వహించడం.. దానిపై సురేఖ నేరుగా ముఖ్యమంత్రి కి ఘాటుగా ఫిర్యాదు లేఖ రాయడం అంతర్గత పోరుకు అద్దం పడుతోంది.
మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్షంతో చేసిన సవాల్ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. దీనిపై సీఎం రేవంత్ గట్టిగా మాట్లాడేసరికి జూపల్లి కృష్ణారావు అలకపాన్పు ఎక్కినట్లు ప్రచారంలో ఉంది.
-
కాంగ్రెస్ క్యాడర్లో ఆందోళన..
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పుడు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్రమైన రాజకీయ, పాలనాపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ క్యాడర్లో సైతం అదే ఆందోళన కనిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రతిపక్ష గులాబీ పార్టీతో పాటు కాషాయ పార్టీకి అస్త్రంగా మారే అవకాశం ఉంది.
క్యాబినెట్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకోకపోతే ఇబ్బందికరమన్న విషయాన్ని రేవంత్ గ్రహించాలి. తక్షణం రంగంలోకి దిగి ప్రక్షాళన చేయడం తప్ప మరో మార్గం కూడా కనిపించడం లేదు.