-
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి
-
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. సొంత ఇల్లు కూడా కట్టుకోలే..
-
తన వాటాగా వచ్చిన 300 ఎకరాల భూమి ప్రజలకు వితరణ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఒకసారి సర్పంచ్ అయితేనే దర్పం చూపే రోజులు ఇవి. మండల స్థాయి పదవి దక్కితే హంగామా చేసే రోజులు ఇవి. అటువంటిది రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన. కానీ సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. రాజకీయాల్లో నిజాయితీతోపాటు నిబద్ధతతో గడిపిన చాలామంది నేతలు ఉన్నారు.
అటువంటి వారిలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఒకరు. మంగళవారం ఆయన వయోభారంతో మృతి చెందారు. 85 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ లో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. దీంతో తెలంగాణలో విషాదం అలుముకుంది.
-
అచ్చం నరసయ్య మాదిరిగా..
ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు కుటుంబం మొత్తం కూర్చుని తిన్న తరగని ఆస్తులు సంపాదించేవారు ఎందరో ఉన్నారు. కానీ అదే సమయంలో ఎమ్మెల్యేలుగా వరుసగా గెలిచినా సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. అటువంటి వారిలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నరసయ్య. నిరాడంబరమైన జీవితం గడిపారు. ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. సైకిల్ పై ప్రయాణం చేస్తుంటారు.
-
ఇది నేపథ్యం..
గుమ్మిడి నరసయ్య మాదిరిగానే కొమ్మిరెడ్డి నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఎటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. 1978 నుంచి 1985 మధ్య రెండుసార్లు భువనగిరి ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడా పెట్టలేదు. ప్రభుత్వ ధనాన్ని ప్రజల కోసమే వినియోగించి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఆయన పేరుతో సొంత ఇల్లు కూడా లేదు. ఆయనకు ఉన్న ఆస్తంతా ఒక స్కూటర్. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన కొమ్మిడి నరసింహారెడ్డి ఎప్పుడు ప్రచారాన్ని కోరుకోలేదు. 1943 సెప్టెంబర్ 10న బ్రాహ్మణపల్లి లో జన్మించిన ఆయన 1962 నుంచి 70 వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్ గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
1978లో కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం తట్టుకొని నిలబడ్డారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. తన వార్తగా వచ్చిన భూమిలో 300 ఎకరాల సాగు భూమిని పేదలకు పంచిన గొప్ప మానవతావాది. అందుకే ఆయన మృతితో భువనగిరి నియోజకవర్గం లో విషాదం అలుముకుంది.