Hometelanganaక్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి మార్నింగ్‌ వాక్‌!

క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి మార్నింగ్‌ వాక్‌!

•ప్రజా సమస్యలపై ఆరా
•రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు.. డిసెంబరు నాటికి ఇంటింటికీ నల్లా నీరు
•కాళేశ్వరం డిజైన్‌ కమిషన్ల కోసమే మార్చారని బీఆర్‌ఎస్‌పై విమర్శలు

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ఉదయం 9వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్‌వాక్‌ నిర్వహించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9వ వార్డులోనే రూ.4.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో ఈ పనులు వంద శాతం పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.గత పాలకుల నిర్లక్ష్యం,బిల్డర్ల బాధ్యతారాహిత్యం కారణంగా కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైన్లు పూర్తవుతాయని చెప్పారు.అమృత్‌ పథకం కింద రూ.40 కోట్లతో తాగునీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.

‘కేటీఆర్‌కు అవగాహన లేదు’

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి, 60 వేల మందితో ముట్టడి చేసి పంపులు నడుపుతామనడం అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు ద్వారా కేవలం 70 టీఎంసీల నీటినే పంప్‌ చేశారని, అది కూడా ఎల్లంపల్లి నుంచి విడుదలైన నీరేనని ఆరోపించారు. దీంతో ప్రజలపై కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లుల భారం పడిందన్నారు.గతంలో కాకా వెంకటస్వామి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.36 వేల కోట్లతో గ్రావిటీ విధానంలో రూపొందించారని, అయితే కేసీఆర్‌ కుటుంబం కమిషన్ల కోసమే తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టును మార్చి రీడిజైన్‌ పేరుతో తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. లక్షల కోట్ల అప్పులకు కేసీఆర్‌ కుటుంబమే బాధ్యత వహించాలని అన్నారు.

‘చెన్నూరు రైతులకు న్యాయం చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే’

కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌ కారణంగా చెన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాల పంట నష్టపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భూసేకరణ కింద లక్ష్మీపూర్‌ రైతులకు ఇవ్వాల్సిన రూ.33 కోట్ల పరిహారాన్ని నిలిపివేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ నష్టపరిహారం అందించి రైతులకు న్యాయం చేశామని తెలిపారు.
హరీశ్‌రావు చెన్నూరు నియోజకవర్గంపై అనవసరంగా దృష్టి సారిస్తున్నారని విమర్శించిన మంత్రి, సిద్ధిపేటలో ప్రజా సమస్యలు లేక సమీక్ష సమావేశాల్లో నోట్‌బుక్కులు, పేపర్ల వంటి చిన్న అంశాలపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో సిద్ధిపేటలో కూడా బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్,స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు