నటి కాజల్ అగర్వాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో తన అనుభవాలు, తీసుకున్న నిర్ణయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవకాశాల కోసం ప్రతి విషయానికీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని సందర్భాల్లో ధైర్యంగా ‘నో’ చెప్పడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. త్వరలో ‘ది ఇండియా స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి నటీనటుడికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి అవకాశాన్ని అంగీకరించాల్సిన పనిలేదని, పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
‘నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతాను. మనం అనుకున్నది జరిగితే మంచిదే. ఒకవేళ జరగకపోయినా అది కూడా మన మంచికే అని భావిస్తాను. అందుకే అవకాశాల కోసం నా అభిప్రాయాలను మార్చుకోను. నచ్చని విషయాలకు ఎలాంటి సందేహం లేకుండా ‘నో’ చెబుతాను’ అని కాజల్ తెలిపారు. యువ నటీనటులు కూడా తమకు ఇష్టం లేని విషయాల్లో రాజీ పడకూడదని ఆమె సూచించారు. ఎంత పెద్ద సినిమా అవకాశం వచ్చినా, అది తనకు సౌకర్యంగా అనిపించకపోతే అంగీకరించనని చెప్పారు. ‘నా మనసు ఒప్పుకోకపోతే నేరుగా క్షమించండి, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేను అని చెప్పేస్తాను’ అని వెల్లడించారు.
బికినీ సన్నివేశాల విషయంలో కూడా తాను ఇదే విధానాన్ని పాటించానని కాజల్ చెప్పారు. అలాగే అతిగా సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి నటుడు, నటి తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అవకాశాల కంటే వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ముఖ్యమనే ఆమె సందేశానికి పలువురు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.