పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇటీవల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)కు చెందిన పలువురు నాయకులను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దద్యాల్–మీర్పూర్ వంతెనతో పాటు ముజఫరాబాద్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చడంతో పాక్ అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే, ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బలప్రయోగానికి దిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పలు ప్రాంతాల్లో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం పీవోకేలోకి వెళ్లే నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందుల సరఫరాపై కూడా ఆంక్షలు విధించినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పీవోకేలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు, నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.