•పదుల సంఖ్యలో ఆశావహులు
•వర్ల రామయ్య, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డికి ఛాన్స్,?
•చంద్రబాబు కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 28 తో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండు రవీంద్రబాబు ఈనెల 28 తో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వారి స్థానంలో కొత్త వారి ఎంపిక జరగనుంది. అయితే ఆ రెండు పదవులు తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. దాదాపు పదిమంది వరకు ఆ పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఆ రెండు ఎమ్మెల్సీల ఎంపిక అనేది చంద్రబాబుకు కత్తి మీద సాము.
పార్టీ కోసం త్యాగం..
మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలు చాలామంది ఉన్నారు. కొందరైతే సీట్లు త్యాగం చేశారు. మరికొందరు పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సీనియర్లు సైతం నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుండడంతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ప్రధానంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి ఒకరికి.. కోస్తాంధ్ర నుంచి మరొకరికి పదవి దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.
చాలామంది ఆశావహులు..
ప్రస్తుతం ఆశావహుల జాబితాలో వంగవీటి రాధాకృష్ణ, బుద్ధ వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, మహాసేన రాజేష్, పిఠాపురం వర్మ.. ఇలా చాలామంది నేతలు ఉన్నారు. వీరంతా పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఇందులో పిఠాపురం వర్మతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు తమ సీట్లను కూడా త్యాగం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ హామీ వీరికి దక్కింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో వీరు తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరి వైపు మొగ్గు..
తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నట్టు… ఒక ఎమ్మెల్సీ పదవి రాయలసీమకు కేటాయిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డికి కేటాయిస్తారని సమాచారం. మొన్ననే రాజ్యసభ పదవిని ఆశించారు. దక్కక పోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నేతల్లో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. అందుకే ఆయనకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇంకోవైపు వర్ల రామయ్య కు ఈసారి అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం చాలా సిన్సియర్ గా పని చేశారు వర్ల రామయ్య. ఆయన సీనియారిటీ దృష్ట్యా ఈసారి ఆయనకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..