క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశంలో పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం విషయం మర్చిపోకముందే మరో పరీక్ష పేపర్ కు సంబంధించిన కుంభకోణం బయటపడింది. స్టేట్ ప్లానింగ్ బోర్డులోని చీఫ్ లెవెల్ పోస్టులు భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్సి) నిర్వహించిన నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (విఏసిబి)తో దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తుంది. పిఎస్సీ అంతర్గతంగా జరుగుతున్న విచారణపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పరీక్షలు వ్యవహారానికి సంబంధించిన కుంభకోణం బయటపడినట్లు అయిందని చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పిఎస్సీపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించడంలో ఏవైనా చట్టపరమైన చిక్కులు ఉన్నాయా అనే కోణంలో హోంశాఖ న్యాయ సలహాలు కోరింది. దీని తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్లానింగ్ బోర్డు పరిధిలోని మూడు విభాగాల పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఉమ్మడి పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో 10 సమాధానాలను అసలు పరిశీలించనేలేదని పిఎస్సి స్వయంగా అంగీకరించింది. అప్పటికే రెండు పోస్టులకు సంబంధించిన ర్యాంకు జాబితాలో విడుదలై ఇద్దరు అభ్యర్థులు విధుల్లో కూడా చేరిపోయారు. కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో దాఖలైన ఒక ఫిర్యాదుతో ఈ ఘోర తప్పిదం వెలుగులోకి వచ్చింది. కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో దాఖలైన ఒక ఫిర్యాదుతో అసలు విషయం బయటకు రావడంతో పరీక్ష రాసిన 200 మందికి పైగా అభ్యర్థులు సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ర్యాంక్ జాబితాలను సవరిస్తామని పిఎస్సి ప్రకటించింది. ఈ ప్రకటన చేసినప్పటికీ ప్రక్రియను మాత్రం ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోపాటు ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేఏఎస్ వంటి ఇతర నియామకాలపై కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. వాటిపైన విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని చెబుతున్నారు.
వరుసగా బయటపడుతుండడంతో ఉద్యోగార్డుల్లో తీవ్ర ఆందోళన..
కొద్దిరోజుల కిందట నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, తాజాగా కేరళలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ప్రక్రియలు జరిగిన అవకతవకులతో నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకుంటుండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నిపుణులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.