Homeతెలంగాణఅతడే ఒక సైన్యం!

అతడే ఒక సైన్యం!

•మిడ్జిల్ నుంచి ముఖ్యమంత్రి పీఠం..
•రెండు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం
•రేవంత్ రాజకీయానికి 20 ఏళ్లు పూర్తి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

రాజకీయాల్లో దూకుడు చాలా అవసరం. కానీ అది ఎక్కువైతే చేటు తెచ్చిన సందర్భం కూడా ఉంటుంది. అయితే రాజకీయాల్లో రాణించాలనుకునేవారు ప్రజలతో మమేకం అయి పని చేయాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలి. లేకుంటే చాలా కష్టం. అయితే ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అని చెప్పుకోవాలి. రాజకీయాలంటేనే వారసత్వం ఒక అర్హతగా భావించే రోజులు ఇవి. కానీ అటువంటిది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా.. ఢిల్లీ స్థాయిలో అండదండలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అంటే.. దటీజ్ వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కే సాధ్యం అయింది. కేవలం తన వాగ్దాటితో, అలుపెరగని పోరాట శైలితో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది రేవంత్ రెడ్డి కే సాధ్యమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెండు దశాబ్దాల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

జడ్పిటిసి గా ప్రస్థానం..
రెండు దశాబ్దాల కిందట రాజకీయ ఎంట్రీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి 2006లో ఒక స్వతంత్ర జడ్పిటిసి సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు కూడా. రేవంత్ ఎప్పుడైనా ఆ మాట చెప్పి ఉంటే అందరూ నవ్వుకునేవారు. ఆ ఎన్నికల్లో స్థానిక పెద్దలను, పార్టీల లెక్కలను తలకిందులు చేస్తూ సాధించిన విజయం.. ఆయన రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది వేసింది. ఆ తరువాత కూడా ఏ పార్టీ మద్దతు లేకుండా 2007లో స్థానిక సంస్థల కోటాలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించగలిగారు. పరిమిత వనరులతోనే వ్యవస్థలను ఎలా ఎదిరించవచ్చో ఆయన తన తొలి ఇన్నింగ్స్ లోనే నిరూపించుకున్నారు.

వన్ మ్యాన్ ఆర్మీగా..
రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రయాణం వన్ మ్యాన్ ఆర్మీ లాంటిది. కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కాలం నుంచి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు ఆయన ప్రసంగాల్లోని పదును, ప్రత్యర్థులపై విరుచుకుపడే నైజం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. ఓటుకు నోటు కేసు వంటి తీవ్రమైన రాజకీయ సంక్షోభాలు, జైలు జీవితం, సొంత ఇలా కాలు ఘోర పరాజయం వంటి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడ వెనుకడుగు వేయలేదు రేవంత్. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. మరింత కసితో ముందుకు సాగడమే రేవంత్ ఒక సాధారణ నాయకుడి నుంచి మాస్ లీడర్ గా ఎదిగేందుకు దోహదపడింది. అయితే భారత రాష్ట్ర సమితి నేతలు ఆయన టిఆర్ఎస్ లో ఉండే సమయంలో.. హరీష్ రావు వెనుక ఉన్న ఫోటోలు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. కేవలం వారిలో కించపరచాలని ఉద్దేశం కనిపిస్తుంది. కానీ దాని వెనుక రేవంత్ ఎదిగిన వైనం కనిపిస్తుంది.

కసితో ఎంపీగా..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోయారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. జాతీయస్థాయిలో తన గ్రాఫ్ పెంచుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయే పరిస్థితుల్లో.. 2021లో హై కమాండ్ ఆయనకు టిపిసిసి బాధ్యతలు అప్పగించింది. పార్టీలోని సీనియర్ల అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు.. తిరుగులేని శక్తిగా ఉన్న అధికార భారత రాష్ట్ర సమితి.. ఇలా అన్నింటిని అధిగమించి తనదైన దూకుడు రాజకీయంతో క్యాడర్లో సరికొత్త జోష్ నింపారు రేవంత్. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలతో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చారు.

స్వశక్తితో ఎదిగి..
రెండు దశాబ్దాల కాలంలో తన స్వశక్తితో ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. స్వయంకృషి, పట్టుదలను ఆయుధాలుగా మార్చుకుని 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తాను పాలమూరు బిడ్డని అంటూ సగర్వంగా చెప్పుకుంటారు రేవంత్. ఈ బ్యాక్ గ్రౌండ్ లేకుండా… కేవలం ప్రజాబలంతో, పోరాటస్ఫూర్తితో ఎదిగిన రేవంత్ ప్రయాణం.. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి ఒక స్ఫూర్తిదాయకం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు