Homeఅంతర్జాతీయంAI-Powered Cyberattacks: ఏఐతో భారీ సైబర్ దాడుల ముప్పు.. ప్రపంచానికి నిఘా సంస్థల హెచ్చరిక!

AI-Powered Cyberattacks: ఏఐతో భారీ సైబర్ దాడుల ముప్పు.. ప్రపంచానికి నిఘా సంస్థల హెచ్చరిక!

ప్రభుత్వ, వ్యాపార వెబ్‌ సైట్లపై భారీ సైబర్ దాడులు చేసే సామర్థ్యం కలిగిన ఏఐ మోడళ్లు త్వరలో అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచంలోని ప్రముఖ నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా దేశాల నిఘా సంస్థల సమాఖ్య అయిన  ఫైవ్ ఐస్ ఈ విషయంపై కీలక ప్రకటన విడుదల చేసింది.

ఏఐతో ఈజీగా హ్యాకింగ్!

ఈ కొత్త తరహా ఏఐ మోడళ్లు వెబ్‌సైట్లలోని భద్రతా లోపాలను చాలా వేగంగా గుర్తించగలవని, వాటిని ఉపయోగించి హ్యాకింగ్‌ కు అవసరమైన వైరస్‌ లు, స్క్రిప్ట్‌ లను కూడా రూపొందించగలవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద వెబ్‌ సైట్లను హ్యాక్ చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులైన హ్యాకర్ల అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు సాధారణ సైబర్ నేరగాళ్లు కూడా ఏఐ సహాయంతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటీవల అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన కొన్ని అధునాతన ఏఐ మోడళ్లను విదేశీయులు ఉపయోగించకుండా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మోడళ్లకు సైబర్ దాడులకు ఉపయోగపడే సామర్థ్యం ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

ఫైవ్ ఐస్ ఏం చెప్పిందంటే?

ఫైవ్ ఐస్ సంస్థలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు కీలక సూచనలు కూడా చేశాయి. ఈ ప్రమాదాన్ని కేవలం సాంకేతిక సమస్యగా చూడకుండా, జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని సూచించాయి. అలాగే, భవిష్యత్తులో జరిగే ఏఐ ఆధారిత సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థలు, డిఫెన్సివ్ ఏఐ మోడళ్ల అభివృద్ధిపై వెంటనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చాయి.

రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా మారుతుందో, అదే స్థాయిలో కొత్త సైబర్ ముప్పులను కూడా తీసుకురావచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ప్రభుత్వాలు, కంపెనీలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు