Homeక్రైమ్Nalgonda Family Murder: నల్గొండలో నలుగురి దారుణ హత్య.. అన్ని కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు!

Nalgonda Family Murder: నల్గొండలో నలుగురి దారుణ హత్య.. అన్ని కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు!

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహ్మద్ సుల్తాన్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే దారుణంగా హత్యకు గురికావడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఇంట్లో ఉన్న నలుగురిపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యల తర్వాత దుండగులు ఇంటి ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

సుమారు 4 రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో నలుగురు మృతదేహాలు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. కేసును సీరియస్ గా తీసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.

హత్యలకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కుటుంబానికి ఎవరితోనైనా పాత విభేదాలు ఉన్నాయా, వ్యక్తిగత శత్రుత్వం ఏదైనా ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురికావడం నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు