దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పట్టణాలలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల నేపథ్యంలో పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై నడవడం ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాకుండా, అది రాజ్యాంగ పరిరక్షణ పొందిన జీవించే హక్కులో భాగమని స్పష్టం చేసింది. ఒక విషాదకర ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన కేసును విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్‌లు సురక్షితంగా లేకపోవడం లేదా ఆక్రమించబడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టు గమనించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత ప్రభుత్వ సంస్థలదేనని స్పష్టంచేసింది.
ఫుట్‌పాత్‌లు కేవలం నడిచే మార్గాలు మాత్రమే కాదు.. అవి పౌరుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయం. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు, అక్రమ దుకాణాలు వంటి కారణాలతో ఫుట్‌పాత్‌లు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు రోడ్డుపై నడవాల్సి వస్తోంది, ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. ఇకపై మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామపంచాయతీలు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పట్టణ ప్రణాళికలో పాదచారుల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని కోర్టు సూచించింది.
అదేవిధంగా, దేశవ్యాప్తంగా పాదచారుల భద్రతకు సంబంధించి సమగ్ర చట్టాలు అవసరమని భావిస్తూ, ఈ అంశంపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని లా కమిషన్‌ను కేంద్రానికి సూచించింది. ఈ తీర్పుపై రాజకీయ రంగంలో కూడా చర్చ మొదలైంది. పౌరుల నడక హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లే, ఓటు హక్కును కూడా అదే స్థాయిలో గుర్తించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.
also read: కొంచెం ఆలస్యం అయితే ఘోరం జరిగేది… ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ చిన్నారి..