క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారా? ఆయన టిడిపి కొవర్టా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. అవును పేర్లు నాని మా కోవర్ట్ అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించడం పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో ఉంటూ టిడిపి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అంటూ మంత్రి ఆరోపణలు చేశారు. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ప్రకంపనలు రేపుతున్నాయి ఈ ఆరోపణలు. గత కొంతకాలంగా వైసీపీ లైన్ దాటి పేర్ని నాని మాట్లాడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. అవి ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చుతున్నాయి అన్నది విశ్లేషకుల మాట.
రేషన్ బియ్యం మాఫియా..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం వేదికగా రేషన్ బియ్యం మాఫియా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రముఖంగా పేర్ని నాని భార్య పేరు వినిపించింది. ఆమెను అరెస్టు చేస్తారన్న టాక్ కూడా నడిచింది. అయితే అప్పట్లో పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి.. సీఎం చంద్రబాబు విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేశారు. తన భార్యను అరెస్టు చేద్దామని మంత్రి రవీంద్ర కోరితే చంద్రబాబు తప్పు పట్టారని.. ఆడవారితో రాజకీయం ఏంటని తిట్టారని చెప్పుకొచ్చారు పేర్ని నాని. చంద్రబాబు హుందాతనాన్ని గొప్పగా చెప్పుకొచ్చారు అప్పట్లో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా అప్పట్లో ఇది చర్చనీయాంశం గా మారింది.
జగన్ పై విధేయత..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పేర్ని నాని ఎప్పుడు విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. ఆయన కుమారుడు కిట్టు సైతం దూకుడుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల నాని కామెంట్స్ వైయస్సార్ కాంగ్రెస్ లైన్ దాటుతున్నట్టు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలపై ఆయన చేస్తున్న విమర్శలు వైసీపీని డ్యామేజ్ చేస్తున్నాయి అన్న టాక్ ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఓ బాలుడి విన్నపం మేరకు స్వయంగా వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ బాలుడిని పవన్ పరామర్శించడంపై చాలా చులకనగా మాట్లాడారు. దీంతో వైసీపీకి డామేజ్ జరిగింది నాని మాటలతో. అందుకే ఇప్పుడు పేర్ని నాని పై అనుమానాలు పెరుగుతున్నాయి.
ఒప్పందం ప్రకారమే..
మరోవైపు చంద్రబాబు సర్కార్ లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్ని నాని తెలుగుదేశం పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపితో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆయన వ్యవహరిస్తున్నారంటూ వచ్చారు. అయితే అది నిజమేనా అన్న చర్చ నడుస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక రకమైన అనుమానం ఉంది. ఒక్క పేర్ని నాని మాత్రమే కాదు. చాలామంది నేతలు వైసీపీ డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. వారి వైఖరి కూడా అలానే ఉంది. అందుకే మెజారిటీ వైసీపీ శ్రేణులు ఈ ప్రచారాన్ని నమ్ముతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పేర్ని నానిని ఎంతో నమ్మారు. ఆయన కుటుంబం సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే పని చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.