క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే – UBT) పార్టీలో తీవ్ర తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శనివారం) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శివసేనలో ఇక ఎలాంటి గ్రూపులు లేవని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో నడుస్తున్నదే ఏకైక అసలైన శివసేన అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సభను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ‘గతంలో మనం ఏకనాథ్ షిండే పేరును ప్రస్తావిస్తూ ‘శివసేన షిండే గ్రూప్’ అని పిలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి గ్రూపులు లేవు. కేవలం ఒకే ఒక్క శివసేన ఉంది. అది షిండే నేతృత్వంలోనిదే’ అని ప్రకటించారు. అంతకుముందు కొల్హాపూర్‌లోని ప్రముఖ మాతా అంబాబాయి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఆలయ ఆధునీకీకరణ, కారిడార్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, వారసత్వం) అనే సంకల్పంతోనే దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని, మహారాష్ట్రలోని అన్ని జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని అమిత్ షా ఈ సందర్భంగా కొనియాడారు.