-
ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
-
మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుకుంటుందని బిజెపి పై నెపం
-
గులాబీ పార్టీ సహకరిస్తుందని ఆరోపణ
-
సీఎం రేవంత్ గట్టి వ్యూహం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వార్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ పక్కా పొలిటికల్ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిల మధ్య ఉన్న అంతర్గత స్నేహం ప్రజల ముందు బహిర్గతం చేయడానికి మెట్రో అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు రేవంత్. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఆయన గురిపెట్టిన మెట్రో బాణం అనుకున్న రాజకీయ ఫలితాన్ని.. క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సీఎం రేవంత్ మెట్రో వ్యవహారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు అసలు దీని వెనుక ఉన్న సూత్రధారులు కేసిఆర్, కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్..
మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడాన్ని తెలంగాణ సీఎం రేవంత్ హైలెట్ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారం అందించడం లేదని విమర్శిస్తున్నారు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు ఈ విషయంలో. అయితే ఇప్పుడు సరికొత్త ఆయుధం సంధిస్తున్నారు. కిషన్ రెడ్డికి అంతగా అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ లేదని.. కేటీఆర్ చెబుతున్న పొలిటికల్ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఢిల్లీలో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను కలిసి.. మెట్రో లోన్ రాకుండా అడ్డుపడుతున్నారు అంటూ రేవంత్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మెట్రో రెండో దశ పనులకు వేగంగా పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లి పోతుందని భయంతోనే ఆ ఇరు పార్టీలు చేతులు కలిపాయని రేవంత్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా రేవంత్ సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నారు.
-
డిఫెన్స్ లో గులాబీ నేతలు..
సీఎం రేవంత్ గులాబీ పార్టీ నేతలను కార్నర్ చేయడం ప్రారంభించారు. రేవంత్ ఎప్పుడైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారో.. అప్పుడే కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కిషన్ రెడ్డిని ప్రశ్నించడం మాని దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలంటూ గులాబీ పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీంతో కిషన్ రెడ్డితో కేటీఆర్ చేతులు కలిపారు అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కిషన్ రెడ్డిని కేటీఆర్ వెనుకేసుకు రావడానికి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రేవంత్. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వ్యూహాన్ని పాటించారు. మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డుపడుతోందని ఒకవైపు బిజెపిని.. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో రేవంత్ సక్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది.