తెలుగు జానపద గీతాలకు ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఫోక్ పాటలు ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ప్రతి నెలా కొత్త కొత్త జానపద గీతాలు విడుదలవుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న పాటలు యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వీక్షణలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన పలు ఫోక్ పాటలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ‘రాను బొంబాయికి రాను’, ‘ఓ పిలగ వెంకటేష్’ వంటి పాటలు సాధించిన విజయాలు తెలుగు జానపద సంగీతానికి ఉన్న ఆదరణను మరోసారి నిరూపించాయి.
ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు ‘నీలాపురి గాజుల’ పాట దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో, యూట్యూబ్ వేదికల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ పాటే వినిపించే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువత ఈ పాటను తెగ ఆస్వాదిస్తూ వీడియోలు, నృత్య ప్రదర్శనలు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు లక్షలాది మంది ప్రేక్షకులు స్పందించగా, వీక్షణల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.
‘నీలాపురి గాజుల’ పాట కొత్తది కాదు. గతంలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘మహాత్మ’ చిత్రంలో ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పట్లో ఆ పాటకు వచ్చిన ఆదరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అదే పాటను కొత్త శైలిలో జానపద రూపంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పాత మాధుర్యాన్ని కాపాడుతూ, నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రూపొందించిన ఈ కొత్త రూపం మంచి స్పందనను అందుకుంటోంది.
ఈ పాటలో వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి తమ నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఉత్సాహభరితమైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తూ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా వైష్ణవి సోని తన హావభావాలు, నృత్య నైపుణ్యంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు ఈశ్వర్ సాయి కూడా తన శక్తివంతమైన నృత్యంతో ఆకట్టుకుంటున్నాడు. వీరిద్దరి జోడీ ఈ పాట విజయానికి ప్రధాన బలంగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ జానపద గీతాన్ని హనుమంత్ యాదవ్ ఆలపించగా, సంగీతాన్ని వెంకట్ అజ్మీర్ అందించారు. పాటకు సంబంధించిన పదాలను ఆవుదూర్తి లక్ష్మణ్ రచించారు. పాత పాటలోని కొన్ని భాగాలను అలాగే ఉంచి, రెండో చరణంలో కొత్త పదాలను జోడించడం ద్వారా ఈ పాటకు కొత్తదనం తీసుకువచ్చారు. సంప్రదాయ జానపద సంగీతానికి ఆధునిక శైలిని జోడించి రూపొందించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో భారీ ఆదరణతో దూసుకుపోతోంది. వీక్షణల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ పాట త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలకు అలర్ట్