Homeతెలంగాణఅత్యాధునిక సౌకర్యాలతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌...డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క...

అత్యాధునిక సౌకర్యాలతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌…డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించగా, అందులో తొలి విడతగా రూ.50 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సోమవారం అంబేద్కర్ భవన్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో నిర్మించనున్న ఈ నాలెడ్జ్ సెంటర్ నిరుపేద విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించే కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని భట్టి తెలిపారు. ఇందులో శిక్షణ తరగతులు, ఆధునిక డిజిటల్ లైబ్రరీ, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని పంచుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యా, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ కేంద్రాలు దోహదపడతాయని అన్నారు.

అదే విధంగా, నింబోలి అడ్డలోని ఎస్సీ హాస్టల్‌ను ఆధునికీకరిస్తున్నామని, దానికి “బాబు జగ్జీవన్ రామ్ భవన్”గా నామకరణం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు