జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లుగా తన పేరును వేరే విధంగా ప్రస్తావిస్తున్న విషయంపై ఆమె తొలిసారి స్పందించారు. ఇక నుంచి తనను “అన్నా కొణిదెల” అనే పేరుతోనే పిలవాలని అభిమానులు, మీడియా ప్రతినిధులు, నెటిజన్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.
తన పుట్టినరోజు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు అన్నా తెలిపారు. ఒక వ్యక్తికి పేరు అనేది ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు అని, అందుకే తన పేరు విషయంలో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో అన్నా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఖాతా ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నానని, చాలాసార్లు రాసి మళ్లీ తొలగించానని తెలిపారు. అయితే ఇప్పుడు తన మనసులోని మాటను అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్‌తో వివాహం జరిగిన సమయంలో తాను “అన్నా లెజినోవా” పేరుతో అందరికీ పరిచయం అయ్యానని, అయితే వివాహం అనంతరం భర్త ఇంటి పేరును స్వీకరించి “అన్నా కొణిదెల”గా మారినట్లు ఆమె వివరించారు. ఇకపై తనను అదే పేరుతో పిలవాలని కోరారు.
“అన్నా కొణిదెల అనే పేరులోనే నేను పూర్తిగా నన్ను గుర్తించుకుంటాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ సందేశంతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఓ ప్రత్యేక ఫొటోను కూడా అన్నా షేర్ చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ పర్యటన సందర్భంగా తీసుకున్న ఫొటో అని ఆమె పేర్కొన్నారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా, అన్నా చిరునవ్వుతో కనిపించారు.
అన్నా కొణిదెల పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆమె నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఆమెను అన్నా కొణిదెలగానే సంబోధిస్తామని పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.
also read: బెంగళూరులో మహిళకు వేధింపులు.. వీడియో వైరల్ కావడంతో నిందితుడి అరెస్ట్
