బెంగళూరులో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. రామమూర్తి నగర్ ప్రాంతంలో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కథనం ప్రకారం.. క్యాబ్ కోసం రోడ్డుపై వేచి ఉన్న సమయంలో విజయ్ రాఘవ్ అనే వ్యక్తి టూ-వీలర్‌పై వచ్చి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని తెలిపింది. అతడి ప్రవర్తనను గమనించిన మహిళ వెంటనే తన ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇలాంటి ఘటనల సమయంలో చుట్టుపక్కల వారు స్పందించాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించింది.
వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు విజయ్ రాఘవ్‌ను అరెస్ట్ చేశారు. మహిళల భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తత అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
also read: 12 ఏళ్లకే అరుదైన గౌరవం.. భవిష్యత్ స్పెయిన్ రాణిగా చరిత్ర సృష్టించనున్న యువరాణి లియోనోర్
