ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా తన సభ్యులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో తమ నిధులను సులభంగా పొందేందుకు నిబంధనలను మరింత సరళీకరించింది. ఈ మార్పులతో అర్హత కలిగిన సభ్యులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించడం ద్వారా ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టింది.
ఇప్పటివరకు పీఎఫ్ ఖాతా నుంచి పూర్తి మొత్తాన్ని తీసుకోవాలంటే సభ్యులు స్పష్టమైన కారణాలు చూపించాల్సి వచ్చేది. అంతేకాకుండా సంబంధిత ఆధార పత్రాలు, ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉండేది. అనేక సందర్భాల్లో పత్రాల్లో లోపాలు ఉండటం లేదా సరైన ఆధారాలు లేకపోవడం వల్ల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే తాజా మార్పులతో ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ అర్హులైన సభ్యులు ప్రత్యేక పరిస్థితుల కింద ఎలాంటి కారణం వివరించకుండానే తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లోని మొత్తం సొమ్మును ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది.
గతంలో పీఎఫ్ ఖాతాలోని సొమ్ములో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 100 శాతం నిధులను పొందే అవకాశం కల్పించారు. క్లెయిమ్‌ల తిరస్కరణలను తగ్గించడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు తక్షణ సహాయం అందించడం, క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరేలా పీఎఫ్ సంస్థ పలు సంస్కరణలు అమలు చేస్తోంది. డిజిటల్ సేవలను విస్తరించడం, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, నిబంధనలను సరళీకరించడం వంటి చర్యలు కూడా చేపడుతోంది.
కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఒక సంస్థ 15 రోజులకంటే ఎక్కువ కాలం లాకౌట్‌కు గురైనా లేదా పూర్తిగా మూతపడినా ఉద్యోగులు తమ నిధులను పూర్తిగా తీసుకునే అర్హత పొందుతారు. అలాగే ఎలాంటి నష్టపరిహారం లేకుండా ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా మొత్తం బ్యాలెన్స్‌ను పొందవచ్చు. రెండు నెలలకు పైగా జీతం అందకపోయినా పూర్తి సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఉద్యోగిపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటం, ఉద్యోగం నుంచి తొలగింపు, పదవీ విరమణ లేదా ఉద్యోగాల కోత కారణంగా నిరుద్యోగిగా మారిన సందర్భాల్లో కూడా పూర్తి పీఎఫ్ సొమ్మును పొందవచ్చు. కంపెనీ సుదీర్ఘకాలం మూసివేయబడిన పరిస్థితుల్లోనూ ఈ సదుపాయం వర్తిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యం, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ సొంత పొదుపులను సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.
ALSO READ: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్..! (VIDEO)