క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- టెక్నాలజీ ప్రపంచంలో మరో పెద్ద మార్పుకు గూగుల్ ఏఐ స్టూడియో తెరలేపింది. ఇప్పటివరకు యాప్ తయారు చేయాలంటే కోడింగ్ నేర్చుకోవాలి, డెవలపర్ టీమ్ ఉండాలి, టెస్టింగ్ చేయాలి అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఏఐ టూల్‌తో కోడింగ్ తెలియని వాళ్లు కూడా కేవలం కొన్ని మాటలు టైప్ చేస్తే ఆండ్రాయిడ్ యాప్‌ను తయారు చేసుకునే అవకాశం అందుతోంది.
గూగుల్‌లోని లోగన్ కిల్పాట్రిక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కేవలం వారం రోజుల్లోనే 2.5 లక్షలకు పైగా ఆండ్రాయిడ్ యాప్‌లు ఈ టూల్ ద్వారా రూపొందినట్లు చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ యాప్‌లు తయారు చేసిన వారిలో చాలామందికి ఇంతకుముందు యాప్ డెవలప్‌మెంట్ అనుభవం కూడా లేదట.
గూగుల్ జెమినీ సహాయంతో యూజర్లు తమకు కావాల్సిన యాప్ గురించి సాధారణంగా టైప్ చేస్తే, ఏఐ అవసరమైన కోడ్‌ను ఆటోమేటిక్‌గా తయారు చేస్తోంది. దీంతో విద్యార్థులు, చిన్న వ్యాపారులు, కంటెంట్ క్రియేటర్లు, అలాగే హాబీగా యాప్‌లు చేయాలనుకునే వారు కూడా సులభంగా యాప్‌లు రూపొందించగలుగుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు 3 బిలియన్‌కు పైగానే ఉన్నారని గూగుల్ చెబుతోంది. అలాంటి భారీ యూజర్ బేస్ కోసం ఇప్పుడు ఎవరికైనా యాప్ తయారు చేసే అవకాశం రావడం టెక్ రంగంలో కీలక మార్పుగా చూస్తున్నారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే… గూగుల్ త్వరలో ఏఐ స్టూడియోలో తయారైన యాప్‌లను నేరుగా ప్లే స్టోర్‌లో ప్రచురించే ఫీచర్ కూడా తీసుకురావొచ్చని సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ప్లే టెస్ట్ ట్రాక్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నా, భవిష్యత్తులో నేరుగా స్టోర్‌కి పంపే అవకాశం రావొచ్చని చెబుతున్నారు.
అయితే ఏఐతో యాప్ తయారు చేయడం సులభమైనా, ప్లే స్టోర్‌లో ప్రచురించడానికి కొన్ని నియమాలు తప్పనిసరి. డెవలపర్లు ముందుగా ప్లే కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా అవసరం అవుతుంది. యాప్ స్క్రీన్‌షాట్లు, ఐకాన్, ప్రైవసీ పాలసీ, డేటా వినియోగం వంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.ఏఐతో యాప్‌లు తయారు చేయడం సులభమవడం పట్ల సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. కొందరు ఇది కొత్త అవకాశాలకు దారి తీస్తుందని అంటుంటే… మరికొందరు ప్లే స్టోర్‌లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందించిన గూగుల్ టీమ్, నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది.
మొత్తానికి… గూగుల్ ఏఐ స్టూడియో ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోంది. కోడింగ్ తెలిసినా… తెలియకపోయినా… ఒక ఐడియా ఉంటే చాలు, యాప్‌గా మార్చే రోజులు మరింత దగ్గర పడుతున్నాయి.