Homeక్రీడలుIPL 2026: ముచ్చటగా మూడోసారి ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్.. ఫైనల్‌లో బెంగళూరుతో సమరం!

IPL 2026: ముచ్చటగా మూడోసారి ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్.. ఫైనల్‌లో బెంగళూరుతో సమరం!

గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్‌ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడేందుకు రెడీ అయ్యింది.

20 ఓవర్లలో 214 పరుగులు చేసిన రాజస్థాన్

మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు జడేజా 45 పరుగులతో అజేయంగా నిలవగా, ఫెరీరా కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. గుజరాత్‌ బౌలర్లలో హోల్డర్‌, రబాడా చెరో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు.

గిల్ సూపర్ సెంచరీ.. ఫైనల్లోకి గుజరాత్

215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 32 బంతుల్లో 58 పరుగులు చేసి విజయానికి బలమైన పునాది వేశాడు. అనంతరం కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్‌ వైపు తిప్పేశాడు. గిల్‌ కేవలం 53 బంతుల్లోనే 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గిల్‌ దూకుడు ముందు రాజస్థాన్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఫలితంగా గుజరాత్‌ కేవలం 18.4 ఓవర్లలోనే 219/3 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

అద్భుత శతకంతో గుజరాత్‌ ను ఫైనల్‌కు చేర్చిన శుభ్‌ మన్‌ గిల్‌ కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పుడు టైటిల్‌ కోసం ఆర్‌సీబీతో తలపడనుంది. క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్‌ పోరు ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు