క్రైమ్ మిర్రర్ : విజయనగరం జిల్లా, గంట్యాడ మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలోని రేంగరువు గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేంగరువు గ్రామానికి చెందిన నేగలి పోలయ్య గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోడి విషయమై తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న నేగలి గంగులు (45) ఈ ఘటనను గమనించి, “ఆడవారిని కొట్టడం తప్ప” అంటూ పోలయ్యకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. తనను ప్రశ్నించడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన పోలయ్య.. కోడిని కోసేందుకు తెచ్చుకున్న కత్తితో గంగులు ఛాతిపై బలంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో గంగులు అక్కడికక్కడే మృతి చెందాడు.
కళ్లముందే జరిగిన ఈ హృదయవిదారక ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గంట్యాడ ఇన్ఛార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లక్ష్మణరావు క్లూస్ టీమ్తో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, గ్రామస్థులను విచారించి వివరాలు సేకరించారు. మృతుడి మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇతరుల కాపురంలో సర్దిచెప్పి, మహిళపై దాడిని ఆపబోయిన గంగులు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.
also read : 81 మందితో మోడీ టీం…!
