Homeఅంతర్జాతీయంమోడీ దూకుడుకు బ్రేక్...!

మోడీ దూకుడుకు బ్రేక్…!

  • కీలకమైన సంస్కరణలకు అడ్డు తగులుతున్న ఉద్యమాలు, నిరసనలు

  • జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు అడ్డంకులు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జాతీయస్థాయిలో మోడీ దూకుడు గణనీయంగా తగ్గింది. వరుసగా విపక్షాల ఆందోళనలు, కాక్రోచ్ ఉద్యమాలతో మోడీ సర్కార్ కు ఊహించని తలనొప్పులు ఎదురయ్యాయి. పార్లమెంట్ వేదికగా దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన సంస్కరణలను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తుగడలు వేసింది.

కానీ ఉద్యమాలు, నిరసనల పుణ్యమా అని వాటిని అటకెక్కించింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తో పాటు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు.. చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులపై కేంద్రం కసరత్తు దాదాపు పూర్తి చేసుకుంది.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులను ఆమోదించుకోవాలని బిజెపి వ్యూహరచన చేస్తున్న ప్రతిసారి.. దేశంలో అనూహ్యంగా అనేక రకాల ఉద్యమాలు, వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ ప్రణాళికలను దెబ్బతీస్తున్నాయి.

  • అన్ని ఎన్నికలు ఒకేసారి..

దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అనేది మోది సర్కార్ లక్ష్యం. అయితే జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ముందుకు తేవాలని కేంద్రం భావించిన తరుణంలోనే.. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

విద్యార్థి లోకం భగ్గు మనడంతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ వంటి సంఘాలు, వామపక్ష విద్యార్థి విభాగాలు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాయి. విద్యార్థుల ఆగ్రహం, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో దేశం అటుడుకుతున్న వేళ.. జమిలీ లాంటి సున్నితమైన రాజ్యాంగ సవరణ లను తెరపైకి తెస్తే.. రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగులుతుందని గ్రహించిన కేంద్ర నాయకత్వం.. అప్పట్లో ఆ బిల్లును తాత్కాలికంగా పక్కకు పెట్టక తప్పలేదు.

  • తాజాగా మరో వివాదం..

తాజాగా మరోసారి రాజ్యాంగ సవరణ ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఇంతలోనే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకొని.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ, ప్రతిపక్ష కూటమి మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలకు దిగాయి.

ఓట్ల తొలగింపు, రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తి పై విపక్షాలు గగ్గోలు పెడుతున్న ఈ సంక్షోభ సమయంలో.. ఏకకాల ఎన్నికలు, డి లిమిటేషన్ బిల్లులను ప్రవేశపెడితే ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కుతుంది. ప్రతిపక్షాల దాడి మరింత తీవ్రమవుతుందని భావించి కేంద్రం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది.

అయితే గతంలో ఎన్నడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు ప్రధాని మోదీ. రాజకీయంగా మంచి ఫలితాలు సాధిస్తున్న.. పాలనాపరమైన సంస్కరణలకు అడుగులు వేయడంలో మాత్రం మోదీ వెనక్కి తగ్గాల్సి వస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు