ఐఐటీ గౌహతి పరిశోధకులు సాధారణ రసాయన పద్ధతులకు భిన్నంగా ఒక కొత్త బయో-మిథనాల్ తయారీ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ప్రత్యేకమైన కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఈ బ్యాక్టీరియా సూర్యరశ్మి అవసరం లేకుండా కేవలం రసాయనాలు, వాయువులను ఆహారంగా తీసుకుని జీవించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
కాలుష్య వాయువులతో మీథనాల్ తయారీ
వాతావరణంలో లేదా పరిశ్రమల నుంచి వెలువడే మీథేన్, కార్బన్‌డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులను ఈ బ్యాక్టీరియా గ్రహిస్తుంది. తరువాత తన సహజ జీవక్రియల ద్వారా వాటిని మార్చి బయో మిథనాల్ అనే ద్రవ ఇంధనంగా ఉత్పత్తి చేసి బయటకు విడుదల చేస్తుంది. సాధారణంగా మీథేన్‌ను ఇంధనంగా మార్చాలంటే అధిక ఉష్ణోగ్రతలు, ఖరీదైన రసాయనాలు అవసరం అవుతాయి. కానీ, ఈ కొత్త విధానంలో అవి ఏవీ అవసరం లేకుండా గది ఉష్ణోగ్రతలో ఇంధనం తయారవుతుంది.
ఈ పరిశోధనను ఐఐటీ గౌహతిలోని బయోసైన్సెస్ మరియు బయో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దేవాశిష్ దాస్, కృష్ణ కల్యాణి సాహు నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను వాణిజ్య స్థాయిలోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు చెందిన కాశ్యప్ క్లీన్‌టెక్ ఇన్నోవేషన్స్‌తో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.
87 శాతం తగ్గిన కాలుష్య కారకాలు
ఈ విధానంలో తయారైన బయో మిథనాల్‌ను డీజిల్‌తో కలిపి ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఉన్న వాహనంలో పరీక్షించారు. పరీక్షల్లో ఇది అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ఈ మిశ్రమ ఇంధనం వల్ల కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్ సల్ఫైడ్, పొగ వంటి హానికర ఉద్గారాలు దాదాపు 87 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ఈ కొత్త బయో ఇంధన సాంకేతికత పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషించగలదని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది హరిత ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మార్పుగా మారే అవకాశం ఉంది.