HomeజాతీయంBio-Methanol: బ్యాక్టీరియాతో బయో మిథనాల్ తయారీ.. ఐఐటీ గౌహతి సరికొత్త ఆవిష్కరణ!

Bio-Methanol: బ్యాక్టీరియాతో బయో మిథనాల్ తయారీ.. ఐఐటీ గౌహతి సరికొత్త ఆవిష్కరణ!

ఐఐటీ గౌహతి పరిశోధకులు సాధారణ రసాయన పద్ధతులకు భిన్నంగా ఒక కొత్త బయో-మిథనాల్ తయారీ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ప్రత్యేకమైన కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఈ బ్యాక్టీరియా సూర్యరశ్మి అవసరం లేకుండా కేవలం రసాయనాలు, వాయువులను ఆహారంగా తీసుకుని జీవించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

కాలుష్య వాయువులతో మీథనాల్ తయారీ

వాతావరణంలో లేదా పరిశ్రమల నుంచి వెలువడే మీథేన్, కార్బన్‌డయాక్సైడ్ వంటి కాలుష్య వాయువులను ఈ బ్యాక్టీరియా గ్రహిస్తుంది. తరువాత తన సహజ జీవక్రియల ద్వారా వాటిని మార్చి బయో మిథనాల్ అనే ద్రవ ఇంధనంగా ఉత్పత్తి చేసి బయటకు విడుదల చేస్తుంది. సాధారణంగా మీథేన్‌ను ఇంధనంగా మార్చాలంటే అధిక ఉష్ణోగ్రతలు, ఖరీదైన రసాయనాలు అవసరం అవుతాయి. కానీ, ఈ కొత్త విధానంలో అవి ఏవీ అవసరం లేకుండా గది ఉష్ణోగ్రతలో ఇంధనం తయారవుతుంది.

ఈ పరిశోధనను ఐఐటీ గౌహతిలోని బయోసైన్సెస్ మరియు బయో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దేవాశిష్ దాస్, కృష్ణ కల్యాణి సాహు నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను వాణిజ్య స్థాయిలోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు చెందిన కాశ్యప్ క్లీన్‌టెక్ ఇన్నోవేషన్స్‌తో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.

87 శాతం తగ్గిన కాలుష్య కారకాలు

ఈ విధానంలో తయారైన బయో మిథనాల్‌ను డీజిల్‌తో కలిపి ఫోర్ స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఉన్న వాహనంలో పరీక్షించారు. పరీక్షల్లో ఇది అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ఈ మిశ్రమ ఇంధనం వల్ల కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్ సల్ఫైడ్, పొగ వంటి హానికర ఉద్గారాలు దాదాపు 87 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ఈ కొత్త బయో ఇంధన సాంకేతికత పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషించగలదని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది హరిత ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మార్పుగా మారే అవకాశం ఉంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు