భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడిపళ్లపై జపాన్ నిషేధం విధించింది. భద్రతా ప్రమాణాలకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. ఈ నిషేధంతో భారత్ నుంచి జపాన్‌కు జరిగే మామిడి ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
అసలేం జరిగిందంటే?
2006లో పాత నిషేధాన్ని తొలగించిన తర్వాత భారత్ మామిడి ఎగుమతులు జపాన్‌కు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్ ప్రాంతంలోని శుద్ధి కేంద్రాలను జపాన్‌కు చెందిన క్వారంటైన్ నిపుణులు పరిశీలించారు. ఆ పరిశీలనలో ఫ్యుమిగేషన్ ప్రక్రియలు, క్రిమిసంహారక చర్యల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశమే తాజా నిషేధానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఎగుమతులపై తీవ్ర ప్రభావం
ఈ నిర్ణయం వల్ల ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే ప్రధాన ఎగుమతి సీజన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఈ కాలంలోనే భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో మామిడిపండ్లు విదేశాలకు పంపబడతాయి. ముఖ్యంగా బంగినపల్లి, ఆల్ఫోన్సో, కేసర్, లాంగ్రా వంటి ప్రముఖ రకాలపై ఈ నిషేధం ప్రభావం చూపనుంది.
జపాన్ అధికారులు ఏమన్నారంటే?
యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ విడుదల చేసిన నోటీసు ప్రకారం, మార్చి 25 తర్వాత భారత్ జారీ చేసే తనిఖీ ధ్రువీకరణ పత్రాలతో కూడిన మామిడి దిగుమతులను జపాన్ అంగీకరించదు. ప్రమాణాల్లో మెరుగుదల కనిపించి, జపాన్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టంగా తెలిపింది.
1986లోనూ మామిడిపై నిషేధం
అటు 1986లో ఫ్రూట్ ఫ్లై ఇన్ ఫెక్షన్ కారణంగా జపాన్ తొలిసారి భారత మామిడిపై నిషేధం విధించింది. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పరిశీలనల అనంతరం 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా భద్రతా కారణాలతో కొత్త ఆంక్షలు రావడం భారత ఎగుమతి రంగానికి ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ఎగుమతిదారులు, సంబంధిత అధికారులు శుద్ధి ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.