Homeఅంతర్జాతీయంMana Jampala: 9 ఏళ్లకే కోడింగ్.. 12 ఏళ్లకే ఏఐ CEO.. అబ్బుర పరుస్తున్న భారత...

Mana Jampala: 9 ఏళ్లకే కోడింగ్.. 12 ఏళ్లకే ఏఐ CEO.. అబ్బుర పరుస్తున్న భారత సంతతి చిన్నారి!

సాధారణంగా 12 ఏళ్ల వయసులో పిల్లలు చదువులు, ఆటలు, స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. కానీ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మాన జంపాల మాత్రం చాలా చిన్న వయసులోనే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఆమె ఏఐ   ఆధారంగా ఒక స్టార్ట్‌అప్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది.

మాన రూపొందించిన ‘వోక్సా’ అనే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతం పలు దేశాల్లో సేవలు అందిస్తోంది. ఇది ఒక వర్చువల్ రిసెప్షనిస్ట్‌లా పనిచేస్తూ వ్యాపార సంస్థలకు ఎంతో ఉపయోగపడుతోంది. కంపెనీలకు వచ్చే కస్టమర్ కాల్స్‌ను స్వీకరించడం, అవసరమైన సమాచారం ఇవ్వడం, అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, ఆర్డర్లు నమోదు చేయడం, వాటికి సంబంధించిన ఫాలోఅప్ చేయడం వంటి పనులను ఇది నిర్వహిస్తుంది. దీంతో వ్యాపార సంస్థలు ముఖ్యమైన కాల్స్‌ను మిస్ కాకుండా చూసుకోవచ్చు.

ఈ సేవ ప్రస్తుతం భారత్, కెనడా, కంబోడియా వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చిన్న వయసులోనే మాన సాధించిన ఈ విజయం అందరినీ ఆకట్టుకుంటోంది. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె కోడింగ్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకుంది. ఆ తర్వాత తన ఆసక్తిని మరింత పెంచుకుంటూ 11 ఏళ్లకే సొంతంగా ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది.

ఈ ఆలోచన రావడానికి కూడా ఒక కారణం ఉంది. తన తండ్రి పనిచేసే కార్యాలయంలో సిబ్బంది బిజీగా ఉండటం వల్ల చాలాసార్లు కస్టమర్ల కాల్స్‌కు స్పందించలేకపోయేవారని మాన గమనించింది. దాంతో కొన్ని వ్యాపార అవకాశాలు కూడా కోల్పోతున్నారని ఆమె గుర్తించింది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ‘వోక్సా’ను రూపొందించింది.  ప్రస్తుతం ఈ ఏఐ వర్చువల్ రిసెప్షనిస్ట్ 24 గంటల పాటు అందుబాటులో ఉండి కస్టమర్లతో మాట్లాడగలుగుతోంది. సంస్థలకు అవసరమైన అనేక పనులను ఆటోమేటిక్‌గా నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో మాన జంపాల సాధించిన ఈ విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు