Homeఆంధ్ర ప్రదేశ్రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్?!

రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్?!

•కొత్త పార్టీయా.. తెలుగు దేశమా?
•సన్నిహిత నేతలతో విస్తృత చర్చలు
•నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:-
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? కొత్త పార్టీ పెడతారా? 2029 ఎన్నికల్లో బరిలో దిగుతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో గత కొద్ది రోజులుగా దీనిపై చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమిళనాడులో విజయ్ టీవీ కే అధికారంలోకి రావడంతో దీనిపైనే ఎప్పటికప్పుడు చర్చ నడుస్తోంది. గత నాలుగు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తొలుత ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో తారక్ పొలిటికల్ అడుగులు వెయ్యబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

గతంలో పార్టీకి మద్దతుగా ప్రచారం..
జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయ ఆసక్తి ఉన్న విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారం కూడా చేశారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2009లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో ప్రమాదానికి కూడా గురయ్యారు. అయినా సరే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రచారంలో పాలుపంచుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. తదనంతర పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది.

తరచూ జూనియర్ ఎన్టీఆర్ పేరు..
ప్రధానంగా 2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు పడింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది పార్టీలో. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైనంత పని జరిగింది. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు తెలుగుదేశం నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని కూడా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కి పెట్టారు అని ఆరోపించిన వారు ఉన్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ తో పొత్తులో టిడిపి అధికారంలోకి రాగలిగింది. లోకేష్ ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మొత్తం పార్టీ బాధ్యతలు తానే చూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టిడిపికి లోకేష్ రూపంలో బలమైన నాయకత్వం కూడా ఉంది.

ఇప్పటికిప్పుడు కాదట..
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని.. కానీ అది 2034 నాటికి అని తెలుస్తోంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో చేరుతారా? లేకుంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? అన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన టిడిపిలో ఉంటూ నాయకత్వం నచ్చని నేతలతోనూ.. వైసీపీలో ఉన్న తన సన్నిహితులతోనూ చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే అది ఇప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు కాదు అని.. 2034 ఎన్నికలను టార్గెట్ అని తెలుస్తోంది. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో మాత్రం ఎడతెగని చర్చ మాత్రం జరుగుతోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు