ప్రపంచమంతా భక్తిరసంతో నిండిపోయే ఆ దివ్య సమయం వచ్చేసింది. ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న జగన్నాథుడు స్వయంగా భక్తుల మధ్యకు చేరే పవిత్ర ఘడియ ఇది. గంటలు మోగుతుంటే… హరినామం మార్మోగుతుంటే… లక్షలాది మంది భక్తులు ఒకే భావంతో స్వామిని దర్శించుకునే అపూర్వ దృశ్యం ఇది. భక్తుని పిలుపుకు భగవంతుడు స్వయంగా స్పందించే అరుదైన మహోత్సవం జగన్నాథ రథయాత్ర. ఈ దివ్య యాత్రలో ప్రతి అడుగు భక్తికి సంకేతం… ప్రతి చూపు మోక్షానికి మార్గం.
భక్తి, ఆనందం, ఆధ్యాత్మిక ఉత్సాహం అన్నీ ఒకే వేదికపై కలిసే మహా పర్వం జగన్నాథ రథయాత్ర. ఒడిశాలోని పూరీ పట్టణంలో ప్రతి ఏడాది ఘనంగా జరిగే ఈ వేడుకలో, జగన్నాథ స్వామి తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి ఆలయం వెలుపలికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు. ఆలయంలోకి వెళ్లలేని వారికి కూడా స్వామి దర్శనం లభించాలనే దివ్య సంకల్పంతో ఈ రథోత్సవం జరుగుతుంది.
ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఈ రథయాత్రను లక్షలాది మంది భక్తులు కళ్లారా చూస్తారు. భారీ రథాలను తాడుతో లాగడం ద్వారా భక్తులు తమ సేవను సమర్పిస్తారు. రథంపై కొలువై ఉన్న స్వామిని దర్శించుకోవడం ద్వారా పాపాలు నశించి, పునర్జన్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం.
జగన్నాథ స్వామి విగ్రహాల ప్రత్యేకత కూడా ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ. చేతులు, కాళ్లు పూర్తిగా లేకుండా కనిపించే ఈ రూపం వెనుక భక్తి పరవశతను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక లీలా ఉందని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర కలిసి తమ బాల్యస్మృతులను స్మరించుకుంటూ భక్తి పరాకాష్టకు చేరినప్పుడు వారి రూపం ఇలా మారిందని విశ్వాసం.
ఈ రథయాత్ర పూరీ ప్రధాన ఆలయం నుండి గుండీచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ స్వామివారు కొన్ని రోజులు విరామం తీసుకుని, తిరిగి తమ ఆలయానికి చేరుకుంటారు. మధ్యలో జరిగే ‘హేరా పంచమి’ వంటి ఉత్సవాలు ఈ పర్వానికి మరింత ప్రత్యేకతను ఇస్తాయి. చివరగా ‘సోనాబేష’లో స్వామివారు బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చి భక్తులను కటాక్షిస్తారు.
ఈ ఉత్సవం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపబడుతోంది. హరే కృష్ణ ఉద్యమం ద్వారా అనేక దేశాలలో రథయాత్రలు నిర్వహించబడుతూ, భక్తి భావాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ ఈ పర్వంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఈ దివ్య యాత్రలో భాగమై, “హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే” అనే మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుని కృపను పొందడం నిజమైన ఆనందం. ఈ రథయాత్ర మనిషి జీవితానికి ఆధ్యాత్మిక దిశను చూపించే మహత్తర సందేశం.
also read: అర నిమిషంలో 195 కిస్సులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్ఢ్ రికార్డ్!