-
నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతోనేనా..?
నల్లగొండ,క్రైమ్ మిర్రర్: గత కొద్ది రోజుల క్రితం అధికారులు ఆపివేసిన నల్లమట్టి తవ్వకాలు, చెన్నారం చెరువులో మళ్ళీ మొదలయ్యాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజాప్రతినిధి మద్దతుతో, పర్సనల్ అసిస్టెంట్లతో కుదిరిన ఒప్పందాలతో, ఈ అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతోందని నియోజకవర్గ స్థాయిలో చర్చ జోరుగా కొనసాగుతుంది. అధికారుల విచారణలో ఆగిన నల్లమట్టి తవ్వకాలు, ఉన్నట్లుంది పరుగులు పెట్టడం వెనుక గల అసలు రహస్యం ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అక్రమం అని అధికారులు మూసేసిన తవ్వకాలు, మళ్ళీ ఎలా సక్రమమై టిప్పర్లు రోడ్లు ఎక్కాయో వింతగా ఉంది. ఈ ఒక్క రోజు అధికారుల కండ్లు మూస్తే, లక్షలు మింగేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది..!? మరి జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో ఈ దందా ఉందా.. లేక స్థానిక అధికారులే ములాఖత్ అయ్యారా అనేది రహస్యంగా మారింది..!? ఆపిన నల్లమట్టి తవ్వకాలు తిరిగి కొనసాగుతుంటే, పట్టించుకోని అధికారులు ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుస్తారు..!?
అధికారుల ‘చేతివాటం’.. పర్యవేక్షణ లేని తవ్వకాలు…
గత కొద్ది రోజుల క్రితం ‘క్రైమ్ మిర్రర్’ కథనాల ద్వారా అక్రమాలను బయటపెట్టి, తాత్కాలికంగా ఆ పనులను నిలిపివేసినప్పటికీ, వ్యవస్థలో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. మళ్ళీ మొదలైన ఈ తవ్వకాల వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి మద్దతు ఉందని, ఆయన పర్సనల్ అసిస్టెంట్ ద్వారా డీల్ కుదిరిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఉండటం వల్లనే, ఈ “చీకటి దందా” పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతులు తూతూమంత్రంగా పొంది, నిర్ణీత నిబంధనలు దాటి చెరువు గర్భాన్ని తవ్వుతూ, వేల టన్నుల మట్టిని తరలిస్తున్నారు.
చెన్నారం చెరువును కబళిస్తున్న ఈ మట్టి మాఫియా వల్ల, చెరువు గర్భం దెబ్బతినడమే కాకుండా, ఓవర్ లోడ్ టిప్పర్ల వల్ల ఊరి రోడ్లు కుంగిపోతున్నాయి. దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అసిస్టెంట్లకు, కాంట్రాక్టర్లకు మధ్య కుదిరిన ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కూడా అనుకొస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన కాంట్రాక్టర్ల అనుమతులను వెంటనే రద్దు చేయాలని, మొన్న ఆపిన పనులు మళ్ళీ పునరుద్దరణకు గల మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఉన్నత అధికారులు ఇప్పటికైనా మేల్కొని, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, ఈ అక్రమ నల్లమట్టి తవ్వకాలను శాశ్వతంగా అడ్డుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.