గుంటూరు, క్రైమ్‌మిర్రర్ః జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులకు విస్తరించే పనిలో పడ్డారు. ఇప్పటికే కేరళకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, కర్ణాటక నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీ నేషనల్ ఇమేజ్ ను పెంచింది. ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఎదిగిన పవన్, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి గొంతుకగా మారాలని భావిస్తున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో విస్తరణ వేగంగా జరుగుతున్నా, సొంత గడ్డ ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆయన అడుగులు చాలా నెమ్మదిగా పడుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా జనసేనలో ఇప్పటికీ పూర్తిస్థాయి జిల్లా, మండల కమిటీల నియామకం జరగకపోవడం క్యాడర్‌ను కొంత అసహనానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం ఒక కారణమైతే, అర్హులైన వారికే పదవులు దక్కాలనే పట్టుదల మరొక కారణం. అయితే, క్షేత్రస్థాయిలో కమిటీలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, టీడీపీ-బీజేపీ నేతలతో సమన్వయం చేసుకోవడంలోనూ జనసైనికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జాప్యం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో గందరగోళం నెలకొంది.జనసేన బలోపేతానికి మరో పెద్ద అడ్డంకి.. పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న వారితో పాటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్న కొందరు కార్యకర్తలు. అధికారంలోకి వచ్చాక యాక్టివ్ అయిన వారు ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు.
పదవులు రాకపోతే కూటమి ప్రభుత్వంపై, సొంత నాయకత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ధోరణిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అందుకే, అడ్వాంటేజ్ కోసం వచ్చే వారిని కాకుండా, పదేళ్ల పాటు పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న ఆయన.. బాధ్యతల అప్పగింతలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.టీడీపీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అది కూటమి పునాదులకే దెబ్బ తగులుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ పరంగా దూకుడు తగ్గించి, పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ తన గ్రామ స్థాయి కమిటీలను పటిష్టం చేసుకుంటుంటే, జనసేన వెనుకబడిపోతోందనే ఆందోళన పార్టీ కార్యకర్తల్లో ఉంది.
ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్-ఛార్జుల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం వల్ల కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది.ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వల్ల జాతీయ స్థాయిలో జనసేనకు లభించే గుర్తింపు, భవిష్యత్తులో ఏపీలో పార్టీ ఎదుగుదలకు ప్లస్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పుడు ఎక్కువ మంది చేరడం నిబద్ధత కలిగిన నేతలు వైపు మళ్లింది. ఈ క్రమంలో జరిగే జాప్యం క్యాడర్‌కు ఇబ్బందిగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది పార్టీకి మేలు చేస్తుందని జనసేన అగ్ర నాయకత్వం వాదిస్తోంది. జనసేన పూర్తిస్థాయి కమిటీలతో సరికొత్త రూపం సంతరించుకుంటుందో లేదో వేచి చూడాలి.