దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.
శుక్రవారం పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పోల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పోల్ ప్రమాదవశాత్తూ సమీపంలోని విద్యుత్ వైర్‌కు తగిలినట్లు సమాచారం. దీంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రియబ్రత బెహెరాకు విద్యుత్ షాక్ తగిలింది.
అదే సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు విద్యార్థులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రియబ్రత బెహెరా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గాయపడిన ముగ్గురు విద్యార్థులకు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న జెండా పోల్ విద్యుత్ వైర్‌కు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
also read: బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రవాద సంబంధాలపై తీవ్ర ఆరోపణలు
