క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని కోరిందనే కారణంతో ఓయో గదిలో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మాదాపూర్ ఇన్స్పెక్టర్ కే. వీ. సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం…
నగరంలో నివాసం ఉంటున్న నికిత, ఆమె స్నేహితుడు రవితేజ గత నాలుగేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం ఇద్దరూ సిద్దిక్ నగర్ లోని ఓ ఓయో గదికి వెళ్లారు. సాయంత్రం మద్యం మత్తులో పెళ్లి విషయమై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఆగ్రహానికి గురైన రవితేజ ఆమె తల, మెడపై బలంగా కొట్టడంతో నికిత తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
మృతురాలి కుటుంబానికి తెలిసిన ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వైజాగ్ కు పారిపోయి లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకున్నారు.కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పై నగరానికి తరలించి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు పంపినట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.
