Homeక్రైమ్మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : బంగారు ఆభరణాల కోసం ఓ మహిళను మద్యం మత్తులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. షాద్‌నగర్‌లోని వెంకటరమణ కాలనీకి చెందిన కుమ్మరి మంగమ్మ (48) ఈ నెల 22న ఇంటి నుంచి పనికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగమ్మ చివరిసారిగా ఓ ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించిన పోలీసులు ఆ వాహనానికి సంబంధించిన వివరాలను సేకరించారు.

దర్యాప్తులో ఆటో డ్రైవర్ ఈస్లావత్ చంద్రబాబుతో పాటు పాత్లావత్ మహేందర్‌ కూడా ఆమెతో కలిసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ ముందుకు సాగిన అధికారులు ఇద్దరిపై అనుమానం బలపడటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల ప్రకారం.. మంగమ్మకు సుమారు రెండు వారాల క్రితం ప్రయాణ సమయంలో చంద్రబాబు పరిచయమయ్యాడు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలను గమనించిన అతడు వాటిని దోచుకోవాలని మహేందర్‌తో కలిసి పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నెల 22న హాజీపల్లి రోడ్డులోని కల్లు కాంపౌండ్ వద్ద మంగమ్మను ఆటోలో ఎక్కించుకుని కొత్తూరు వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ మద్యం, కల్లు కొనుగోలు చేసి అనంతరం నందిగామ శివారులోని ఓ వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఆమెకు మద్యం తాగించిన అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత విషయం బయటకు వస్తుందనే భయంతో మంగమ్మపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఆమె మెడలో ఉన్న సుమారు 28 గ్రాముల బంగారు పుస్తెలతాడుతో పాటు మొబైల్‌ ఫోన్‌ను తీసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. దోచుకున్న బంగారు ఆభరణాలను మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టి సుమారు రూ.లక్ష తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి కీలక ఆధారాల స్వాధీనం

మంగళవారం ఉదయం షాద్‌నగర్‌ పట్టణంలోని విజయ డైరీ సెంటర్‌ సమీపంలో చంద్రబాబు, మహేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టిన రసీదు, ఘటనకు ఉపయోగించిన ఆటో, రెండు మొబైల్‌ ఫోన్లు, బీర్‌ బాటిల్‌ ముక్కలు, రూ.300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న నందిగామ, షాద్‌నగర్‌ పోలీసులను షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ శిరీష అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో నందిగామ సీఐ వీరబాబు, ఎస్‌ఐ సుశీల పాల్గొన్నారు.
also read : వృద్ధురాలి హత్య కేసులో కీలక పరిణామం.. నిందితురాలి భర్త ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు