క్రైమ్ మిర్రర్ : నగల కోసం ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసిన ఘటనను జోగిపేట పోలీసులు ఛేదించారు. విచారణలో హత్యకు పాల్పడిన మహిళను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జోగిపేట సీఐ అనిల్‌కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామంలో ఈ నెల 23న రాత్రి ఒంటరిగా నివసిస్తున్న కొత్తకాడి పోచమ్మ (70) హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో అదే గ్రామానికి చెందిన పట్నం నర్సమ్మపై అనుమానం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోచమ్మ ఇంటికి రాత్రి సమయంలో నర్సమ్మ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అనంతరం నర్సమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా, బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్లు ఆమె అంగీకరించినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పోచమ్మ ఇంటికి నర్సమ్మ వెళ్లి తలుపు తట్టింది. ఎందుకు వచ్చావని పోచమ్మ ప్రశ్నించగా, పని ఉందని చెప్పి ఇంట్లోకి ప్రవేశించింది. అనంతరం వృద్ధురాలి చీరను ఉపయోగించి ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి వద్ద ఉన్న సుమారు తులంన్నర బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను నిందితురాలు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
హత్య సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నర్సమ్మ చేతికి ఉన్న గాజులు పగిలి ఘటనాస్థలంలో పడిపోయినట్లు తెలిపారు. ఆ ఆధారాలతో పాటు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. నర్సమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.
అవమానంతో భర్త ఆత్మహత్య
ఇదిలా ఉండగా.. ఈ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నర్సమ్మ భర్త పట్నం యాదయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి పురుగుల మందు సేవించిన ఆయనను చికిత్స కోసం తరలించినప్పటికీ పరిస్థితి విషమించిందని సమాచారం. భార్య హత్య కేసులో నిందితురాలిగా తేలడంతో కలిగిన అవమానం కారణంగానే యాదయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
also read : సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు.. నలుగురు సిబ్బంది మృతి
