క్రైమ్ మిర్రర్ ; జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ తన సహచర సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కథువాలోని సేవా-2 హైడల్ ప్రాజెక్ట్ సమీపంలో సీఐఎస్ఎఫ్ క్యాంప్ ఉంది. అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అబ్దేష్ కుమార్‌కు తోటి సిబ్బందితో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో సహచరులపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
కాల్పుల్లో అసిస్టెంట్ కమాండ్ స్థాయి అధికారి అంకిత్ కుమార్ పాండేతో పాటు ఎస్‌ఐ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ సంజయ్ కుమార్, కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంప్ వద్దకు చేరుకున్నారు. ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా అంతర్గత విచారణ చేపట్టారు. కాల్పులకు అసలు కారణం ఏమిటి, ఘటనకు ముందు సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం ఏ అంశంపై జరిగింది వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : ఫుట్‌బాల్ జట్టు బస్సును అడ్డగించిన సాయుధులు.. ఆటగాళ్లపై దాడి, విలువైన వస్తువుల దోపిడీ
