Homeక్రైమ్అత్యాచార బాధిత బాలికకు జడ్జి లేఖ.. పరిహారంతో పాటు అందించాలని హైకోర్టు ఆదేశం

అత్యాచార బాధిత బాలికకు జడ్జి లేఖ.. పరిహారంతో పాటు అందించాలని హైకోర్టు ఆదేశం

అత్యాచారానికి గురైన ఓ పదేళ్ల బాలికకు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి రాసిన ధైర్యాన్నిచ్చే సందేశాన్ని ఆమెకు తప్పనిసరిగా అందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చట్టపరమైన తీర్పుతో పాటు బాధితురాలికి మానసికంగా అండగా నిలిచేలా న్యాయమూర్తి వ్యక్తిగతంగా రాసిన సందేశాన్ని కూడా అందించాలని కోర్టు సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కేసులో 2023 జూలై 23న ఏడేళ్ల వయసున్న బాలికపై సుమిత్ శాక్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన రోహిణి పోక్సో కోర్టు నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

తీర్పు సందర్భంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి రజనీ రంగ ప్రత్యేకంగా బాలికను ఉద్దేశించి ఓ సందేశాన్ని రాశారు. నిందితుడిని తాను ‘అంకుల్’గా పిలిచినప్పటికీ, అతను జైలులోనే ఉండాలని బాలిక కోరుకున్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుందని అందులో పేర్కొన్నారు. నిజాన్ని ధైర్యంగా వెల్లడించినందుకు బాలికను అభినందిస్తూ.. బాగా చదువుకుని, తన కలలను నెరవేర్చుకుంటూ సంతోషంగా జీవించాలని న్యాయమూర్తి ఆకాంక్షించారు.

ఈ తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను సెప్టెంబర్ 22న ఢిల్లీ హైకోర్టు విచారించింది. జస్టిస్ ప్రతిభ ఎం. సింగ్, జస్టిస్ దినేష్ భుట్‌లతో కూడిన ధర్మాసనం.. ట్రయల్ కోర్టు న్యాయమూర్తి రాసిన సందేశాన్ని బాధిత బాలికకు ధైర్యం కలిగించే ప్రయత్నంగా పేర్కొంది.

ఆ సందేశాన్ని కేవలం కోర్టు రికార్డుల్లో ఉంచకుండా, ముద్రించి బాధితురాలికి లేదా ఆమె కుటుంబ సభ్యులకు అందజేయాలని ఉత్తర-పశ్చిమ ఢిల్లీ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ)ను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా పరిహారంతో పాటు ఈ సందేశాన్ని కూడా బాలికకు అందించాలని స్పష్టం చేసింది.

మరోవైపు, కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు బలంగా ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు.. నిందితుడికి విధించిన శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. బాధితురాలికి పరిహారం చెల్లించిన అంశంపై నివేదిక సమర్పించాలని డీఎల్ఎస్ఏను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.

ఈ ఘటనలో చట్టపరమైన చర్యలతో పాటు బాధితురాలి భవిష్యత్తు, మానసిక ధైర్యాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తి రాసిన సందేశాన్ని కూడా ఆమెకు అందించాలని హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

also read: అల్లు శిరీష్ డీజే ఫిర్యాదుపై పోలీసుల క్లారిటీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు