-
పది రోజుల ఉత్కంఠకు తెర
-
పార్టీ శ్రేణుల వ్యతిరేకంతో కేసి వేణుగోపాల్ కు నో ఛాన్స్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కేరళ కాంగ్రెస్ రాజకీయాలకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అనూహ్య పరిణామాల నడుమ కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతిశన్ పేరు ఖరారు అయింది. గత పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య బలమైన పోటీ జరిగింది. సీనియర్ నేత కేసి వేణుగోపాల్ వర్సెస్ ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సతీషన్ పోటీ పడ్డారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరాయంగా పోరాడుతున్న సతీషన్ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొగ్గు చూపారు.
ఆయనకిస్తే తీవ్ర వ్యతిరేకత..
కేసి వేణుగోపాల్ పేరు చివరి వరకు వినిపించింది. కానీ ఆయనను ముఖ్యమంత్రి చేస్తే పార్టీలోని రాష్ట్రస్థాయి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ప్రమాదం ఉందని హై కమాండ్ ఒక అంచనాకు వచ్చింది. పార్టీలో అంతర్గత తిరుగుబాటు వచ్చే అవకాశాన్ని ముందుగానే పసిగట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న సతీషన్ వైపే మొగ్గు చూపక తప్పలేదు.
అందుకే ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించింది. కేసి వేణుగోపాల్ కు వ్యతిరేకంగా మల్లపురం నుంచి తిరువనంతపురం వరకు ఉన్న స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బాహటంగానే గళం ఎత్తారు. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ అప్రమత్తం అయ్యింది. సతీషన్ నాయకత్వంలోనే పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండగలవని భావించి ఈ నిర్ణయానికి వచ్చారు. కేరళలో పార్టీ గెలుపు వెనుక ఆయన కృషి ఉందని గుర్తించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
కొత్త తరానికి బాధ్యతలు
కేరళలో కొత్త రాజకీయ శకం ప్రారంభం అయింది. సతీషన్ ఎంపిక ద్వారా కేరళలో కాంగ్రెస్ కొత్త తరం నాయకత్వానికి తెరలేపింది. కేసి వేణుగోపాల్ ను ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని భావిస్తోంది. రాష్ట్ర పాలనా బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించడం ద్వారా పార్టీని ఐక్యంగా ఉంచుకోవాలని చూస్తోంది.
సతీషన్ ఎంపికపై పార్టీ వర్గాల్లో సంతృప్తి కనిపిస్తోంది. కెసి వేణుగోపాల్ వంటి సీనియర్ల సేవలను జాతీయ స్థాయిలో వినియోగించడం ద్వారా సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ హై కమాండ్. తీవ్ర వర్గ పోరు నడుమ కేరళలో ముఖ్యమంత్రి పదవి ఎంపిక చేయడం అనేది పెద్ద చర్య. దానిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది కాంగ్రెస్ హై కమాండ్.