HomeజాతీయంNEET UG 2026 Leak: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు,పుణె...

NEET UG 2026 Leak: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు,పుణె ప్రొఫెసర్‌ కులకర్ణి అరెస్టు

NEET UG 2026 Scam: నీట్‌ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ కేసులో సీబీఐ కీలక చర్యలు చేపడుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్‌ పి.వి. కులకర్ణిని అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఆయన రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల ప్రక్రియలో భాగంగా పనిచేసిన అనుభవం ఉండటంతో, ప్రశ్నపత్రాలకు సంబంధించిన వివరాలు పొందే అవకాశం ఆయనకు లభించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.

ఏప్రిల్‌ చివరి వారంలో మహిళతో కలిసి పేపర్‌ లీక్‌

ఏప్రిల్‌ చివరి వారంలో మనీషా వాఘ్మారే అనే మహిళతో కలిసి కులకర్ణి పేపర్‌ లీక్‌ కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుణెలోని తన నివాసంలో కొంతమంది ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌ తరగతులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ తరగతులకు మనీషా విద్యార్థులను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. సీబీఐ అధికారులు తెలిపిన ప్రకారం, ఆ కోచింగ్‌ క్లాసుల్లోనే విద్యార్థులకు నీట్‌ ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగానే చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ చెప్పిన ప్రశ్నల్లో చాలావరకు మే 3న నిర్వహించిన అసలు నీట్‌ యూజీ 2026 పరీక్షలో వచ్చినట్లు దర్యాప్తులో బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ముందుగా మనీషా వాఘ్మారేను మే 14న అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే కులకర్ణిపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్

ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి జైపూర్‌, గురుగ్రామ్‌, నాసిక్‌, పుణె, అహల్యానగర్‌ ప్రాంతాల్లో మొత్తం ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది. వారిలో ఐదుగురిని ఇప్పటికే కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇటీవల అరెస్టైన మరో ఇద్దరు నిందితులను ట్రాన్సిట్‌ రిమాండ్‌ కోసం పుణెలోని కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం వారిని ఢిల్లీకి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. నీట్‌ పరీక్షలో జరిగిన ఈ అక్రమాలపై సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు