తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ పని తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులపై ప్రజల్లో ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది. కానీ, విజయ్ మాత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే క్రమశిక్షణతో పనిచేస్తూ అధికారులను ఆకట్టుకుంటున్నారని సమాచారం.
ముందుగానే ఆఫీస్ కు..
సచివాలయ వర్గాల ప్రకారం, విజయ్ ప్రతిరోజూ సమయానికి ముందుగానే కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగిలా విధి నిర్వహణలో కట్టుదిట్టమైన సమయపాలన పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. నిర్ణయించిన సమయానికి కనీసం పావుగంట ముందే సచివాలయానికి వస్తుండటం అక్కడి సిబ్బందిలో కూడా చర్చకు దారితీసింది.
సాదాసీదాగా రోజువారీ పనులు
ఇంకా, ఆయన తన రోజువారీ పనులను చాలా సాదాసీదాగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. బయట నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేయించకుండా, ఇంటి నుంచే లంచ్ బాక్స్ తీసుకువస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయానికి తన చాంబర్ లోనే భోజనం పూర్తి చేసి, వెంటనే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో పని విషయంలో ఆయన చూపుతున్న కట్టుబాటు అధికారులను ఆకట్టుకుంటోందని చెబుతున్నారు.
హామీలను అమలుపై జాగ్రత్తలు
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆర్థిక వనరులు కీలకమని భావిస్తున్న ఆయన, ఆ దిశగా అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం పెరిగే మార్గాలు, సంక్షేమ పథకాల అమలు, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపై సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ముఖ్యమైన ఫైళ్లను స్వయంగా పరిశీలిస్తూ, ప్రతి శాఖ పనితీరుపై వివరాలు తెలుసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తంగా ముఖ్యమంత్రిగా విజయ్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త చర్చకు కారణమైంది. సమయపాలన, సింప్లీసిటీ, పనిపై దృష్టి వంటి అంశాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.