HomeజాతీయంRG Kar Case: ఆర్‌జీ కర్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌!

RG Kar Case: ఆర్‌జీ కర్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌!

Kolkata RG Kar Case: కోల్‌కతాలో సంచలనం రేపిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అప్పటి కోల్ కతా పోలీస్ కమిషనర్ కూడా..

సస్పెండ్‌ అయిన అధికారుల్లో అప్పటి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌తో పాటు, డిప్యూటీ కమిషనర్లుగా పనిచేసిన ఇందిరా ముఖర్జీ, అభిషేక్‌ గుప్తా ఉన్నారు. కేసు ప్రారంభ దశలోనే సరైన విధంగా దర్యాప్తు జరగలేదనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు.  ఈ ముగ్గురు అధికారులు కేసు విచారణలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, కేసును వెనక్కి తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. వారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే అంశం కూడా ఇప్పుడు తీవ్రంగా మారింది.

ఇంకా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడం కూడా శాఖాపరమైన నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: సీఎం సువేందు

ఈ విషయంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందిస్తూ, కేసులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించబోమన్నారు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతుందని, అవసరమైతే మరింత కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌జీ కర్‌ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైద్య విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లు రాత్రింబవళ్లు ఆందోళనలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌తో కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు