విశాఖపట్టణం, క్రైమ్ మిర్రర్: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్వ వైభవానికి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండో విడత ఆర్థిక చేయూతను ప్రకటించింది. ఇప్పటికే గతేడాది రూ.11,440 కోట్లు కేటాయించి ప్లాంట్‌ను గాడిలో పెట్టిన కేంద్రం, ఇప్పుడు కార్యకలాపాలను దీర్ఘకాలం పాటు సుస్థిరంగా కొనసాగించేందుకు అదనంగా మరో రూ.8,097 కోట్లు మంజూరు చేయనుంది. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ ప్యాకేజీకి సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేసి, ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపారు.ఆర్థికశాఖలోని వ్యయ విభాగం పచ్చజెండా ఊపిన వెంటనే ఈ అంశం కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది.
క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ నిధులు స్టీల్‌ప్లాంట్‌కు అందుతాయి. తొలిదశ ప్యాకేజీ తరహాలోనే, ఈ రూ.8,097 కోట్లను కూడా ఈక్విటీ రూపంలో సమకూర్చాలని కేంద్ర ఉక్కుశాఖ నిర్ణయించింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రాన్ని సంప్రదించడంతో రూ.11,440 కోట్ల ప్యాకేజీ అందింది. అందులో రూ.10,300 కోట్లు ఈక్విటీగా, మిగిలిన రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల రూపంలో అందాయి.
ఇప్పుడు అందుతున్న రెండో ప్యాకేజీతో ప్లాంట్ ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.ప్రస్తుతం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉక్కు ఉత్పత్తి ,అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్లాంట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న తరుణంలో, కేంద్రం అందిస్తున్న ఈ రెండో విడత సాయం ప్లాంట్ మనుగడకు అత్యంత కీలకం కానుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ స్టీల్‌ప్లాంట్ సమస్యలను పరిష్కరిస్తోంది. ఉక్కు కార్మికుల ఆందోళనలు, ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాల నేపథ్యంలో కేంద్రం వరుసగా ఇస్తున్న ఈ ప్యాకేజీలు కార్మికుల్లో ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.