-
రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
-
హై కమాండ్ గ్రీన్ సిగ్నల్
-
రాజ్యసభ పదవి సైతం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. పూర్వ వైభవం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే తెలుగుదేశం పరంగా ఆ పార్టీ, అటు జనసేన బలపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ రెండు పార్టీలతో చూసుకుంటే బిజెపి వెనుకంజలో ఉంది. గత కొద్దిరోజులుగా బిజెపి కార్యకలాపాలు కూడా తగ్గాయి. ఈ తరుణంలో బిజెపి హై కమాండ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ పగ్గాలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే కాదు. త్వరలో రాజ్యసభకు సైతం నల్లారి ప్రమోట్ అవుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం.
Also Read:తెలంగాణలో జెన్ జీ తుస్!
ఇటీవల మళ్ళీ తెరపైకి…
సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో కనిపించారు. ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణతో సరిహద్దు జలాల వివాదాన్ని ప్రస్తావించారు. నాడు విభజన సమయంలోనే ఈ సమస్యలు పరిష్కరించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణతో సహృద్భావ వాతావరణంలో చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. చత్తీస్గడ్ తో పాటు ఒడిస్సా తో ఉన్న నదీ జలాల వివాదాలను సైతం పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఉన్నట్టుండి కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి సరిహద్దు జలాల వివాదాల గురించి మాట్లాడడం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం వినిపిస్తోంది.
Also Read:వైసీపీపై బోరుగడ్డ తిరుగుబాటు!
మొన్నటి ఎన్నికల్లో ఓటమి…
మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం అని తెలిసినా పోటీకి ముందుకు వచ్చారు. బిజెపి తరఫున బరిలో దిగడంతో పొత్తులో భాగంగా చంద్రబాబు సైతం వచ్చి ప్రచారం చేశారు. అయితే తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఓడిపోయిన ఆయనకు రాజ్యసభ పదవి వస్తుందని అంతా భావించారు. మరోవైపు ఆయన సోదరుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ రాజ్యసభ మాత్రం అవకాశం దక్కలేదు. అయితే ముందుగా బిజెపి రాష్ట్ర పగ్గాలు ఆయనకు అందిస్తారని తెలుస్తోంది. తరువాత రాజ్యసభకు ప్రమోట్ చేస్తారని సమాచారం. టిడిపి అధినేతగా చంద్రబాబు, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించి.. ఈ ముగ్గురు నేతృత్వంలో 2029 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది.
Also Read:‘నల్లారి’కి ఏపీ బీజేపీ పగ్గాలు!
చెరగని ముద్ర…
సుదీర్ఘకాలం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానిది చెరగని ముద్ర. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో రాణించారు. ఆయన అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. తక్కువ వయసులోనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో గెలిచిన ఆయన అసెంబ్లీకి స్పీకర్ అయ్యారు. ఇంతలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో హై కమాండ్ ఆదేశాల మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ కొద్ది రోజులకి రాజీనామా చేయడంతో హై కమాండ్ ఆదేశాలతో ఆ బాధ్యతలను తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించారన్న మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని విభేదించారు. సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఓటమి ఎదురు కావడంతో క్రియాశీలక రాజకీయాలకు చాలా రోజులు దూరమయ్యారు. తరువాత బిజెపిలో చేరారు. అటువంటి సీనియర్ నేతకు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి హై కమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
