సౌదీ అరేబియాతో తమకు ఉన్న సైనిక, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాకిస్థాన్ మరియు టర్కీ దేశాలకు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ రెండు దేశాలు తమ సైనిక బలగాలను రంగంలోకి దించడం లేదా సౌదీకి మద్దతుగా ప్రత్యక్ష చర్యలకు దిగడం లాంటివి చేస్తే, వాటిని తీవ్రంగా పరిగణిస్తామని హౌతీలు స్పష్టం చేశారు.ఒకవేళ పాకిస్థాన్ గానీ, టర్కీ గానీ తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తమ బలగాలను మోహరిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదని, వారిపై ఖచ్చితంగా ప్రతీకార దాడులకు పాల్పడతామని హౌతీలు కుండబద్దలు కొట్టారు. హౌతీల ఆధీనంలో ఉన్న థమర్ ప్రావిన్స్ గవర్నర్ మహ్మద్ అల్ బుఖైటి ఈ మేరకు ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. ‘పాకిస్థాన్, టర్కీలు అనవసరంగా మా మధ్యలోకి వస్తే, వారిని ఉక్కు పిడికిలితో అణచివేస్తాం. వాళ్లకు తగిన గుణపాఠం నేర్పిస్తాం’ అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఈ రెండు దేశాలు యెమెన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా పరిస్థితిని మరింత జటిలం చేయవద్దని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరిణామాలకు ఒకరోజు ముందే హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్ పైకి క్షిపణులతో భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో, సౌదీకి మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్థాన్, టర్కీలు ఏదైనా సహాయం చేసే అవకాశం ఉందన్న వార్తల నడుమ హౌతీల నుంచి ఈ స్ట్రాంగ్ వార్నింగ్ రావడం గమనార్హం.సౌదీ అరేబియా నాయకత్వంలోని కూటమి దళాలు గత కొంతకాలంగా యెమెన్‌లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హౌతీల తాజా హెచ్చరికలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్, టర్కీలు హౌతీల హెచ్చరికలపై ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ దేశాలు సౌదీకి మద్దతుగా నిలిస్తే, అది ఒక భారీ ప్రాంతీయ ఘర్షణకు దారితీసే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
