– కొడంగల్ లో భారీ బల ప్రదర్శన
– హైదరాబాద్ నుంచి 200 కార్ల కాన్వాయ్ తో..
– కోస్గిలో పాంచ జన్య సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన జనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి పై దూకుడు ప్రదర్శించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో భారీ బలప్రదర్శనకు దిగారు. పాంచ జన్య సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. రాజధాని హైదరాబాదు నుంచి ఏకంగా 200 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో ఆమె కొడంగల్ వైపు పయనం అయ్యారు. ఎన్నికలు ఏమీ లేకుండానే ఈ స్థాయిలో కవిత బలప్రదర్శన చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ స్థాయిలో శక్తిని ప్రదర్శించడం ద్వారా రాజకీయంగా బలమైన సంకేతాలు పంపాలని ఆమె వ్యూహం రచిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ భారీ యాత్ర హైదరాబాద్ నగర శివారులోని అప్పా జంక్షన్ వద్దకు చేరుకున్న సమయంలో కవితకు భారీ స్వాగతం లభించింది.
ప్రత్యేక ఆకర్షణగా..
దారి పొడవున వందలాది వాహనాలతో భారీ కాన్వాయ్ అనుసరించడం అందర్నీ ఆకట్టుకుంది. దారి పొడవునా కార్యకర్తలు కవితకు గజమాలతో సత్కరిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. తమ నాయకురాలికి ఘనంగా మద్దతు తెలిపారు. వందలాది వాహనాలు వరుస కట్టడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు సందడి నెలకొంది. భారీగా క్యాడర్ తరలిరావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధాన నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ ఇలాంటి భారీ హంగామాలు, కార్ల ర్యాలీలు నిర్వహించడం ద్వారా మీడియాలో, ప్రజల్లో విపరీతమైన ప్రచారం వస్తుందన్న పగడ్బందీ వ్యూహాన్ని కవిత అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా ఆమె కొడంగల్ టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె వ్యూహం ఏంటన్నది అంతు పట్టడం లేదు. రాజకీయంగా ఇప్పటివరకు గులాబీ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. మున్ముందు మరింత దూకుడు పెంచి జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ లను సైతం లక్ష్యంగా చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అచ్చం తండ్రి మాదిరిగా..
ప్రస్తుతం కవిత తన తండ్రి కెసిఆర్ వ్యూహాలను అనుసరిస్తున్నారు. గతంలో కెసిఆర్ ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండేవారు. ఇటీవల కెసిఆర్ ఫ్యామిలీ పై భూ అస్త్రాన్ని ప్రయోగించారు రేవంత్ రెడ్డి. వారి కుటుంబానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఆరోపించారు. అందులో కవిత ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె స్పందించారు. హరీష్ రావు నిబంధనలకు విరుద్ధంగా వేలాది ఎకరాలు సంపాదించారంటూ ఆమె చురకలు అంటించారు. ఆ వివరాలు కావాలంటే ప్రభుత్వానికి పంపిస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కొడంగల్ ను ఆమె టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం ఆకట్టుకుంటుంది. కేవలం సభకు హాజరవ్వడం మాత్రమే కాదు.. మార్గంలో జనబాహుల్యం దృష్టిని ఆకర్షించేలా ఇలా భారీ కాన్వాయ్ తో వెళ్లడం మాత్రం రాజకీయంగా ప్రత్యర్థుల్లో సెగలు పుట్టిస్తోంది. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో జరిగిన పాంచ జన్య సంకల్ప సభకు భారీ జనవాహిని తరలివచ్చింది. పదునైన మాటలతో కవిత తన విశ్వరూపం చూపించారు.
